
రైతుల యూరియా కష్టాలు తీరుస్తాం
నిడమనూరు : కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు నిడమనూరు మండలంలోని వెనిగండ్ల గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి దృష్టికి పలువురు రైతులు, కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత విషయం తీసుకువచ్చారు. మిర్యాలగూడ ర్యాక్ పాయింట్‌కు ఒకటి, రెండు రోజుల్లో యూరియా రానుందని, సాగర్ ఆయకట్టు రైతుల అవసరాలు తీర్చేవిధంగా యూరియా అందించి కష్టాలు తీరుస్తానని ఈ సందర్భంగా జానారెడ్డి వారికి చెప్పారు. వెనిగండ్ల గ్రామ సీలింగ్ భూ వివాదాలు కూడా జానారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఊట్కూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ నాయకుడు విజయ్‌కుమార్.. జానారెడ్డిని కోరారు. ఊట్కూరులో ప్రభుత్వ భూమి 12 ఎకరాలు ఉందని, మరో 8 ఎకరాలు సేకరిస్తే చాలని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమికోసం సర్వే చేసినట్టు జానారెడ్డికి తహసీల్దారు జంగాల కృష్ణయ్య వివరించారు. వెనిగండ్ల గ్రామానికి చెందిన కొప్పోలు మట్టపల్లిరావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులను జానారెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకతి సత్యం, నర్సింగ్ విజయ్‌కుమార్, ముంగి శివమారయ్య, నందికొండ మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జానారెడ్డి