
అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్
దేవరకొండ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్‌రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.2.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు దేవరకొండ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన పిట్ల గంగాధర(అలియాస్) సాంబ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చదువు మధ్యలో ఆపేసి కూలి పనులు చేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గంగాధర జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న దేవరకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాపోతు రమేష్ ఇంట్లో ప్రవేశించి రూ.6 లక్షల నగదు, 2.2 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ చేసిన నగదులో సగం డబ్బు దేవరకొండ పట్టణంలోని ఖిలా పార్క్ వద్ద గంగాధర దాచిపెట్టాడు. ఆ నగదును తిరిగి తీసుకునేందుకు గురువారం పట్టణానికి వచ్చిన గంగాధరను పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చోరీ చేసిన విషయం ఒప్పుకున్నాడు. కాగా గంగాధరపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో సుమారు 100 పైచిలుకు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు చేధించిన దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐలు నారాయణరెడ్డి, మౌనికలతోపాటు సిబ్బంది సతీష్, అంజయ్య, సింహాద్రిలను ఏఎస్పీ అభినందించారు.
ఫ రూ.2.5లక్షల నగదు స్వాధీనం