
కుక్కల బారిన పడొద్దు
దేవరకొండ : కుక్కల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు స్టెరిలైజేషన్, కుక్కల దత్తత కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే కుక్కల బారిన పడకుండా ఉంటామని తెలిపారు. ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయడంతో వీధి కుక్కలు, కోతులు, పిల్లులు వంటివి పెరిగిపోయే అవకాశం ఉందన్నారు. ఇటీవలి కాలంలో వీధి కుక్కల బారిన పడి చాలా మంది గాయాల పాలవుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కుక్కలకు స్టెరిలైజేషన్ చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసాదన్‌రెడ్డి, ఎంపీడీఓ డానియల్, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఉన్నారు.
ఈకేవైసీ, టీహెచ్‌ఆర్‌లో నమోదు చేయాలి
నల్లగొండ టౌన్ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు ఈ కేవైసీ, టీహెచ్‌ఆర్(టేక్ హోం రేషన్)లో నూరు శాతం పూర్తి చేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికాహార ఇండెంట్ వస్తుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి కృష్ణవేణి తెలిపారు. శనివారం నల్లగొండలో చర్లపల్లి సెక్టార్ అంగన్‌వాడీ టీచర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ప్రభుత్వం ఈ కేవైసీ టీహెచ్‌ఆర్ ప్రకారంగానే నిధులు విడుదల చేస్తామని ప్రకటించిందని, లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం ఈ కేవైసీలు 96 శాతం ఉందని దాన్ని రేపటిలోగా నూరు శాతం చేయాలని, టీహెచ్‌ఆర్ లు 66 శాతం మాత్రమే ఉన్నాయని దాన్ని రేపటిలోగా 90 శాతానికి పెంచితేనే వచ్చే నెలకు సంబంధించిన ఇండెంట్ వస్తుందని తెలిపారు. టీచర్లు అధికారులు సమన్వయంతో పని చేస్తూ వాటిని నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
నీలగిరిలో ట్రాఫిక్ పరిశీలన
నల్లగొండ : నీలగిరిలో ట్రాఫిక్ సమస్య ఎదురయ్యే ప్రాంతాలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ శనివారం పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకురాగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, ట్రాపిక్ సీఐ లక్షయ్య తదితరులు ఉన్నారు.

కుక్కల బారిన పడొద్దు