
యువతరం.. సాహిత్యంలో రాణించాలి
రామగిరి(నల్లగొండ) : యువతరం సాహిత్యంలో రాణించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్ భవన్‌లో ఆదివారం తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో యువకవి సమ్మేళనం, సాహిత్య సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజాన్ని అధ్యయనం చేయకుండా కవిత్వం రాయడం వల్ల సరైన కవిత్వం రాదన్నారు. యువత అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని సమాజాన్ని సంస్కరించడానికి తమవంతు కర్తవ్యం నిర్వహించాలన్నారు. కవి, రచయిత, మహబూబ్‌నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మహాప్రస్థానం పుస్తక పరిచయంపై మాట్లాడుతూ మహాప్రస్థానం యువకులకు లాంగ్ మార్చ్ లాంటిదన్నారు. అనంతరం కవి, రచయిత తెలంగాణ సాహితి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన కవితా సంపుటి ‘నువ్వే ఒక సమూహం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 30 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు, కవులు ఈ సభలో పాల్గొని కవితా పఠనం చేశారు. అనంతరం యువకవులకు జ్ఞాపిక, మహాప్రస్థానం పుస్తకాన్ని బహుకరించి సత్కరించారు. ఉత్తమ కవితలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, మట్టికవి డాక్టర్ బెల్లి యాదయ్య, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ నర్రా ప్రవీణ్‌రెడ్డి, బాల సాహితీవేత్త పుప్పాల కృష్ణమూర్తి, పెరుమాళ్ల ఆనంద్, ఏభూషి నరసింహ, బైరెడ్డి కృష్ణారెడ్డి, మాదగాని శంకరయ్య, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, బీమార్జున్‌రెడ్డి, డాక్టర్ సాగర్ల సత్తయ్య, బూర్గు గోపికృష్ణ, పుప్పాల మట్టయ్య, బండారు శంకర్, టి.ఉప్పలయ్య, పగిడిపాటి నరసింహ, గేర నరసింహ, ఆందోజు నాగభూషణం, దాసరి ప్రభాకర్, దాసరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.