పోలీస్‌ గ్రీవెన్స్‌ డేలో వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌ డేలో వినతుల స్వీకరణ

Jul 22 2025 8:55 AM | Updated on Jul 22 2025 8:55 AM

పోలీస్‌ గ్రీవెన్స్‌ డేలో  వినతుల స్వీకరణ

పోలీస్‌ గ్రీవెన్స్‌ డేలో వినతుల స్వీకరణ

నల్లగొండ : పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ 38 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులపై సంబంధిత అధి కారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితుల సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

నేడు ఎన్జీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు

రామగిరి(నల్లగొండ): నల్లగొండ ఎన్జీ కళాశాలలో మంగళవారం ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. కళాశాల స్థాపించి నేడు 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపనున్నారు.. ఇందుకోసం కళాశాల యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సముద్రాల ఉపేందర్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఎంజీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌, రిజిస్ట్రార్‌ అల్వాల రవి ముఖ్య అతిథితులుగా హాజరుకానున్నారు. తెలంగాణ కళాశాల విద్య జాయింట్‌ డైరెక్టర్లు డీఎస్‌ఆర్‌.రాజేంద్రసింగ్‌, పి.బాలభాస్కర్‌, రిటైర్డ్‌ జాయింట్‌ డైరెక్టర్‌, కళాశాల పూర్వ విద్యార్థి జి.యాదగిరి, పూర్వ విద్యార్థులు వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2021–2022 నుంచి 2023–2024 విద్యా సంవత్సరం వరకు వివిధ సబ్జెక్టుల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ ప్రధానం చేయనున్నారు.

ప్రకృతిని రక్షించడంప్రతి ఒక్కరి బాధ్యత

నల్లగొండ : ప్రకృతిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కారాగార పర్యవేక్షణ అధికారి గౌర ప్రమోద్‌కుమార్‌ అన్నారు. ఆయన సోమవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా బంజరు భూముల్లో సీడ్‌ బాల్స్‌ (విత్తన బంతులు) వేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీడ్‌ బాల్స్‌ వేయడం ద్వారా పచ్చదనం పెంపుదల, మట్టి పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చన్నారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు ఈ బాద్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జైలర్‌ సీహెచ్‌.బాలకృష్ణ, డిప్యూటీ జైలర్‌ వెంకట్‌రెడ్డి, చింత వెంకటేశ్వర్లు, గిరిబాబు, సైదులు, నాగరాజు, రవి, శ్రావణ్‌, రాంబాబు పాల్గొన్నారు.

మూసీ ప్రాజెక్టుకు జలకళ

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. మూసీ ఎగువన వర్షాలు కురుస్తుడటంతో ఆదివారం సాయంత్రం మూసీ ప్రాజెక్టుకు 880 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సోమవారం ఉదయానికి ఒక్కసారిగా 2443 క్యూసెక్కులకు పెరిగింది. మూసీ ప్రాజెక్టుకు ఇంత పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్లో రావటం ఈ ఏడాది ఇదే మొదటిసారి. వానాకాలం పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 530 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 642.50 అడుగులకు (3.73 టీఎంసీలు) చేరుకుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో మరో రెండు అడుగుల నీరు చేరితే గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని పేర్కొంటున్నారు.

28 మండలాల్లో

మోస్తరు వర్షం

నల్లగొండ అగ్రికల్చర్‌ : అల్పపీడన ద్రోణి కారణంగా నల్లగొండ జిల్లాలో 10 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా చిట్యాల మండలంలో 62.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నార్కట్‌పల్లి 35.9, కట్టంగూరు 33.1, శాలిగౌరారం 2.4, నకిరేకల్‌ 4.1, కేతేపల్లి 1.6, తిప్పర్తి 1.8, నల్లగొండ 6.3, కనగల్‌ 1.4, హాలియా 1.2, నిడమనూరు 6.6, త్రిపురారం 4.2, వేములపల్లి 7.2, మిర్యాలగూడ 7.7, దామరచర్ల 10.4, అడవిదేవులపల్లి 32.4, తిరుమలగిరి సాగర్‌ 3.1, పెద్దవూర 4.4, చింతపల్లి 0.4, గుర్రంపోడు 7.6, పీఏపల్లి 17.0, నేరేడుగొమ్ము 0.5, దేవరకొండ 2.3, గుండ్లపల్లి 31.5, చందంపేట 21.0, గుడిపల్లి 15.8, మునుగోడు 2.1, నాంపల్లి మండలంలో 3.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement