
ఆయకట్టులో అదునుదాటుతోంది!
మిర్యాలగూడ : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు రైతులు పరిస్థితి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ సీజన్‌లో ముందస్తుగానే కృషానదికి వరద వచ్చింది. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండి.. సాగర్‌కు వరద వస్తుండడంతో ముందస్తుగానే సాగునీరు విడుదలవుతుందని ఆశించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆయకట్టులో కొందరు రైతులు నార్లు పోసుకుని నాట్లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బోర్లు, బావులు లేని రైతులు నీరు విడుదల చేశాక నారు పోసుకుని.. నాట్లు వేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. కానీ సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అదును దాటిపోతోందని ఆవేదన చెందుతున్నారు.
పాలేరుకు వెళ్తున్న జలాలు
నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లా అవసరాలకు కాకుండా ఖమ్మం జిల్లా అవసరాలను తీరుస్తున్నారు. నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటాయి. కానీ ఇక్కడ చెరువులను వదిలేసి ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్‌లో నీటిని నింపారు. రెండు రోజుల నుంచి మళ్లీ పాలేరుకు రోజూ 3 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కానీ ఇక్కడి మేజర్లకు ఎప్పుడు నీటిని విడుదల చేస్తారో చెప్పడం లేదు.
సాగునీటి కోసం ఎదురుచూపు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని రైతులకు ఎడమకాల్వ నీరే ఆధారం. బావులు, బోర్లు ఉన్నా.. కాల్వలో నీరు పారితేనే భూగర్భ జలాలు పెరిగి పంటలు పండుతాయి. కానీ ఆయకట్టులో ఈసారి వర్షాలు కూడా సరిగా లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో రైతులంతా కాల్వలకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. సాగర్‌కు వరద వస్తున్న ఈ తరుణంలో మేజర్ల ద్వారా నీటి విడుదల చేయాల్సి ఉన్నా.. తూములన్నీ బంద్‌చేసి నేరుగా ఖమ్మం జిల్లాకే నీరు తరలించుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి మేజర్లకు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
సాగు, తాగు అవసరాలకు పాలేరుకు విడుదల చేస్తున్నాం : ఎన్‌ఎస్పీ ఈఈ
నీటి విడుదల విషయమై ఎన్‌ఎస్పీ ఈఈ వెంకటయ్యను వివరణ కోరగా.. ప్రభుత్వ ఆదేశానుసారం సాగు, తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లాలోని పాలేరుకు నీటిని తరలిస్తున్నామని తెలిపారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయం నుంచి విడుదల చేస్తున్నామని.. ప్రాజెక్టుకు వరదనీరు వచ్చినా కొద్ది పాలేరుకు నీటి విడుదల పెంచుతామని పేర్కొన్నారు. ఎడమకాల్వకు సాగునీటి విషయంపై ప్రశ్నించగా ఆయకట్టు రైతులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. మేజర్లు, మైనర్లు షట్టర్లు బంద్ చేశారు కదా అని అడగగా అది వాస్తవమేనని సమాధానం దాటవేశారు.
ఫ సాగునీటి కోసం సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు రైతుల ఎదురుచూపు
ఫ మేజర్లకు నీటి విడుదలపై స్పష్టత కరువు