
రెండు విడతలుగా ‘స్థానిక’ పోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా నిర్వహించే ఎంపీటీపీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అనధికారికంగా జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.
జిల్లాలో 33 మండలాలు..
జిల్లాలో మొత్తం 33 మండలాలు ఉన్నాయి. మండలాల పరిధిలో 33 జెడ్పీటీసీలను, 353 ఎంపీటీసీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకు మొత్తం 1,925 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి మొత్తం 11,550 మంది సిబ్బంది అవసరం ఉండగా, 9,588 మంది సిద్ధంగా ఉన్నారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున సిబ్బంది సమస్య తొలగిపోనుంది.
గతంలోనే సంసిద్ధం..
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారన్న చర్చ జరిగింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకొని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దాంతో అప్పట్లోనే జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మండలాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. బ్యాలెట్ పేపర్లను కూడా తీసుకొచ్చి ఎస్పీ కార్యాలయంలో భద్ర పరిచింది. బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసి ఉంచింది. ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పోలింగ్ సిబ్బంది శిక్షణ మాత్రం ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా ఆ శిక్షణ చేపట్టడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
ఫ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
ఫ ఆ తరువాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు
ఫ ఈ నెలాఖరుకు లేదంటే ఆగస్టు మొదటివారంలో షెడ్యూల్
ఫ ఎన్నికల నిర్వహణకు అన్నీ సిద్ధం చేస్తున్న యంత్రాంగం
అన్నీ సరి చూసుకోవాలని ఆదేశాలు..
ఎన్నికల షెడ్యూల్ ఈ నెల చివరలో లేదంటే ఆగస్టు మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి అధికారులు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. దీంతో స్టేషనరీ, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులతో పాటు సిబ్బంది నియామకాల విషయంలో అధికారులు తనమునకలయ్యారు. గతంలో చేసిన ఏర్పాట్లను సమీక్షించుకొని మిగతా అవసరాలపైనా దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ ఏమేం తక్కువగా ఉన్నాయి.. ఏ మేరకు అవసరం ఉన్నయో గుర్తించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జెడ్పీ సీఈఓ శ్రీనివాస్‌రావు తెలిపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ సిబ్బంది, ఆర్‌వోల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని తెలిపారు.