
ప్రభుత్వ బడికి పూర్వ వైభవం
గుర్రంపోడు : గతేడాది వెలవెలబోయిన గుర్రంపోడు మండలంలోని నడికూడ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం విద్యార్థులతో కళకళలాడుతోంది. ఉపాధ్యాయుల అంకితభావం, పట్టుదలతో ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది పాఠశాలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయుడు కాళం నారాయణరెడ్డి విధుల్లో చేరగానే విద్యార్థుల సంఖ్యను పెంచాలనే సంకల్పంతో తోటి ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, యువతతో కలిసి చర్చించారు. వేసవి సెలవులకు ముందే పెద్ద ఎత్తున ముందస్తు బడిబాట నిర్వహించి ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల ఇళ్లకు ఒకటికి నాలుగుసార్లు వెళ్లి వారిని మెప్పించారు. గ్రామపెద్దలు, యువతను తీసుకుని వెళ్లి వారితో తమ ఊరి బడిలో తమ పిల్లలను చదివించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 85 మందికి చేరింది.
ఖాళీగా ప్రైవేట్ స్కూల్ బస్సులు
గతంలో ఈ గ్రామం నుంచి గుర్రంపోడు, కొప్పోలు, హాలియా, వెల్మగూడెం గ్రామాల ప్రైవేట్ పాఠశాలల బస్సులు నడిచేవి. గ్రామస్తులు, యువత ముందుగా ప్రైవేట్ బస్సుల్లో విద్యార్థులు వెళ్లకుండా నిలువరించారు. పిల్లలంతా గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో చేరేలా సహకరించారు. దీంతో ఆ పాఠశాల ప్రస్తుతం కొత్త కళను సంతరించుకుంది.
ఫ 30 నుంచి 85కు చేరిన
విద్యార్థుల సంఖ్య
ఫ సత్ఫలితాన్నిచ్చిన ముందస్తు బడిబాట
ఫ ఉపాధ్యాయులకు సహకరించిన
గ్రామ యువత
తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడతాం
గత ఏడాది పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులందరికీ గురుకుల సీట్లు వచ్చేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. గ్రామంలో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు రాని గురుకుల సీట్లు మా పాఠశాలకు రావడాన్ని తల్లిదండ్రులకు వివరించాం. ప్రైవేట్ విద్యార్థుల కంటె తమ పాఠశాల విద్యార్థులే బాగా చదువుతాని చాలెంజ్ చేశాం. తాము విద్యార్థులపై ఎలా శ్రద్ధ తీసుకుంటున్నామో వారు అర్థం చేసుకున్నారు. మా నమ్మకం ఉంచి పాఠశాలలో చేర్పించిన తల్లిందండ్రుల నమ్మకం నిలబెట్టేలా మరింత బాధ్యతతో పనిచేస్తున్నాం.
– కాళం నారాయణరెడ్డి, హెచ్‌ఎం

ప్రభుత్వ బడికి పూర్వ వైభవం