
చెరిగిపోతున్న చెరువు ఆనవాళ్లు!
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
మిర్యాలగూడ : కబ్జాదారుల చెరలో చిక్కి చెరువులు ఆనవాలు కోల్పోతున్నాయి. చెరువుల ఆక్రమణపై ఇటీవల కలెక్టర్ సమీక్షించి చెరువలు కబ్జాకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఫలితంగా చెరువు భూములు నివాస సముదాయాలు, వ్యవసాయ భూములుగా మారుతున్నాయి. చెరువులో నీరు తగ్గడమే తరువాయి కబ్జాదారులు అందులో మట్టిపోసి ఆక్రమించుకుంటున్నారు. దీంతో చెరువులపై ఆధారపడిన మత్స్యకారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిర్యాలగూడలో అధికంగా..
మిర్యాలగూడ నియోజకవర్గంలోని చెరువు భూములు ప్రస్తుతం కబ్జాకు గురవుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని పందిర్లపల్లి చెరువు సర్వే నంబర్ 32లో, మిర్యాలగూడ శివారులోని సర్వే నంబర్ 118 కలుపుకుని సుమారు 480 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఇప్పటికే సగానికి పైగా కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని గతంలోనే ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు స్పందించి హద్దురాళ్లు ఏర్పాటు చేసి కబ్జా కాకుండా అడ్డుకున్నారు. ప్రస్తుత మళ్లీ ఆక్రమణకు తెరలేపారు. హద్దురాళ్లను తొలగించి చెరువు భూముల్లో మట్టి పోసి వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఫ మిర్యాలగూడ మండలంలోని రుద్రారం గ్రామంలోని రుద్రప్ప చెరువు సర్వే నంబర్ 117లో 310 ఎకరాలు ఉండగా అందులో 140 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గతంలో వెలుగులోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కబ్జాకు గురవుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
అక్రమాలకు తెరలేపారు ఇలా..
పందిర్లపల్లి చెరువు పక్కన సర్వే నంబర్ 116, 117లో ఎకరన్నర పట్టా భూమి ఉండగా.. దానికే ఆనుకుని సర్వే నంబర్ 118లో 203.26 ఎకరాల చెరువు శిఖం ఉంది. దాంతోపాటు సర్వే నంబర్ 114లో 128.38ఎకరాల బంచరాయి భూములు ఉన్నాయి. ఆ భూమి అంతా కబ్జా గురైంది. అయితే చెరువు పక్కన పట్టా భూమి ఉన్న వారు ఆ భూమిని ఎప్పుడో అమ్మేసుకుని శిఖం, బంజరు భూములను కబ్జా చేస్తున్నారు. వీరంతా ధనవంతులు కావడం, అధికార అండ ఉండడంతో ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పందిర్లపల్లి చెరువును సుందరీకరణ చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ భూములను కబ్జా చేసేందుకు తెర లేపారు. బంజరు, శిఖం భూముల గుండా పోవాల్సిన నెక్లెస్ రోడ్డును మార్చేసి చెరువు సమీపం నుంచి తీయడంతో అక్రమార్కులకు కబ్జాకు అవకాశం దొరికింది.
న్యూస్‌రీల్
ఫ కబ్జాకు గురవుతున్న చెరువు భూములు
ఫ సాగు భూములను ప్లాట్లుగా
మారుస్తున్న ఆక్రమణదారులు
ఫ చోద్యం చూస్తున్న అధికారులు
ఫ ఉపాధి కోల్పోతామని
మత్స్యకారుల ఆవేదన
అధికారుల అలసత్వం
సాగు, తాగునీటికి జీవనాధారంగా ఉన్న చెరువులు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అలసత్వం కారణంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. చెరువు ఆక్రమణపై కలెక్టర్, సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదులు అందినా ఫలితం ఉండడం లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ కబ్జాల పరంపరం కొనసాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చెరువు భూముల కబ్జాలను అరికట్టాలని కోరుతున్నారు.