
కల్వర్టును ఢీకొని కారు దగ్ధం
కోదాడరూరల్: కల్వర్టును ఢీకొట్టిన కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వై జంక్షన్ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రోళ్లపూడికి చెందిన జి. అనిల్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ పనిమీద మంగళవారం కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తూ.. మార్గమధ్యలో ఇద్దరి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో కోదాడ పట్టణ శివారులోని కొమరబండ వై జంక్షన్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అనిల్‌తో పాటు మరో ఇద్దరు ప్రయానికులు క్షేమంగా బయటపడ్డారు. అనిల్ కారును వెనక్కి తీస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
నేటి నుంచి అథ్లెటిక్స్ పోటీలు
పెద్దవూర: పెద్దవూర మండలం చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ క్లస్టర్ లెవల్ అథ్లెటిక్ మీట్–2025 నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 9 జేఎన్‌వీల నుంచి 57మంది బాలురు, 39 మంది బాలికలు ఈ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొంటారని తెలిపారు. క్లస్టర్ లెవల్‌లో ఎంపికై న 25మంది బాలురు, 25మంది అమ్మాయిలు ఈ నెల 27వ తేదీన కర్ణాటక రాష్ట్రం గదక్ జిల్లా మందరాగి జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగే రీజనల్ మీట్‌లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.