
విద్యుదాఘాతంతో రైతు మృతి
వేములపల్లి: బోరు బావి వద్ద విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గబావిగూడేనికి చెందిన నంద్యాల ఆదిరెడ్డి (58) మంగళవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని బోరు బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని రైతు నలబోతు వెంకన్న గమనించి దగ్గరుకు వెళ్లి చూడగా ఆదిరెడ్డి పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వేములపల్లి పోలీసులు తెలిపారు.