
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ ఎన్జీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో ఖాళీగా సబ్జెక్టులు బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ తెలిపారు. బీబీఏ 3, బయోటెక్నాలజీ 1, బిజినెస్ అనాలటిక్స్ 1, వాణిజ్యశాస్త్రం 2, కంప్యూటర్ సైన్స్ 7, డాటసైన్స్ 1, ఎకనామిక్స్ 2, హిందీ 1, మ్యాథ్స్ 3, పిజిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, స్టాటిస్టిక్స్ 1, తెలుగు 6, ఉర్దూ 1, జువాలజీ 1 సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, పీహెచ్‌డీ, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా కళాశాలలె దరఖాస్తులు సమర్పించాలని, 28వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు ఓరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
జిల్లా గ్రంథాలయంలో దాశరథి జయంతి
రామగిరి(నల్లగొండ) : జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడన్నారు. కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, సాహితీ మేఖల సంస్థ కార్యదర్శి పున్న అంజయ్య, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా నారాయణరెడ్డి
నల్లగొండ : పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా కాలం నారాయణరెడ్డి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఫణికుమార్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో నారాయణరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నర్సింహారెడ్డి, జితేందర్‌రెడ్డి, నరేష్, జానారెడ్డి, భిక్షంగౌడ్, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
నేటి నుంచి ఆర్టీసీ డిపోల్లో సంబరాలు
రామగిరి(నల్లగొండ) : రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేసిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నల్లగొండ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు 10,31,28,640 మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసి రూ.502 కోట్ల లబ్ధి పొందినట్లు రీజనల్ మేనేజర్ జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఈ నెల 23న నల్లగొండ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల పరిధిలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని, బస్సుల్లో రెగ్యులర్‌గా ప్రయాణించే ఐదుగురు మహిళలను గుర్తించి సన్మానిస్తామని తెలిపారు.
ఉపాధ్యాయులకు నేడు శిక్షణ
నల్లగొండ : జిల్లాలోని ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున 100 మంది, ప్రైమరీ పాఠశాలల కాంప్లెక్స్‌ల నుంచి 200 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 23న నల్లగొండలోని డైట్ కాలేజీలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రంథాలయాల నిర్వహణ, బాధ్యతలు, పఠన వ్యూహాలు, గ్రంథాలయ కమిటీల ఏర్పాటు, పుస్తకాల ఎంపిక తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
విదేశాల్లో విద్యకు దరఖాస్తులు
నల్లగొండ : విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిది పథకం కింద 500 సీట్లు పెంచినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శశికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల ఎస్సీ విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ లోగా tela nganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.