
ముఖ గుర్తింపుతోనే పింఛన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆసరా పింఛన్లను ఇక నుంచి ఫేస్ రికగ్నేషన్ (ముఖ గుర్తింపు) విధానంతో అందజేయనున్నారు. వేలి ముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా పెన్షన్లు ఇస్తున్న విధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తూ, సులభంగా పింఛన్ అందజేసేలా ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఫొటోలు తీసి, అప్‌లోడ్ చేసి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 24న పోస్టాఫీస్‌ల బీపీఎంలకు ఫేస్ రికగ్నేషన్ యాప్ అప్ లోడ్ చేసిన సెల్‌ఫోన్లు అందజేయనుంది. జూన్ నెలకు సంబంధించిన పింఛన్లు ఇంకా ఇవ్వలే దు. ఈనెల 24 తరువాత ఫేస్ రికగ్నేషన్ విధా నం ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించారు.
4,58,677 మంది పెన్షనర్లు
ప్రస్తుతం రాష్ట్రంలో 10 రకాల పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. ఆయా కేటగిరీల్లో పింఛన్లు పొందే వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,58,677 మంది ఉన్నారు. వారిలో వృద్ధాప్య పింఛన్‌దారులే అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పింఛన్‌దారులు 1,75,450 మంది ఉండగా, వితంతు 1,60,597 మంది, వికలాంగులు 54,110 మంది, ఒంటరి మ హిళలు 14,104 మంది ఉండగా, మిగతా వారు బీడీ వర్కర్స్, చేనేత, కల్లుగీత, హెచ్‌ఐవీ, ఫైలేరియా, డయాలసిస్ పేషెంట్లు పింఛన్లు పొందుతున్నారు.
వేలిముద్రతో ఇబ్బందులు
పింఛన్ పొందాలంటే కచ్చితంగా పోస్టాఫీసులకు వెళ్లి ఆయా అధికారుల వద్ద బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధులకు వేళ్లపై ముద్రలు చెరిగిపోయి స్కాన్ కాకపోవడంతో వారు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు ఐరిష్‌లో కూడా ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి వారు మండల, వార్డు అధికారులు ప్రత్యేకంగా రాసిచ్చిన పత్రం ద్వారా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధుల్లో కొందరు రోగాల బారిన పడి ఇంటికే పరిమితమైన సమయంలో పింఛన్లు పొందలేకపోతున్నారు.
ఫ బయోమెట్రిక్ సమస్యకు చెక్ పెట్టేలా ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అందజేత
ఫ 24న హైదరాబాద్‌లో సమావేశం.. బీపీఎంలకు సెల్‌ఫోన్లుఅందజేయనున్న ప్రభుత్వం
ఫ ఈ నెల నుంచే కొత్త విధానంలో పింఛన్ల పంపిణీ
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4.58 లక్షల మంది పింఛన్‌దారులు
పింఛన్లు సులభంగా అందేలా..
బయోమెట్రిక్ విధానంలో పింఛన్లు ఇవ్వడంలో తలెత్తుతున్న సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ యాప్‌ను తీసుకొస్తోంది. ప్రభుత్వం అందజేసే సెల్‌ఫోన్‌లో బీపీఎంలు పింఛన్‌దారుల పేర్లు, వివరాలను అప్‌లోడ్ చేస్తారు. యాప్ ద్వారా ఫొటో తీసిన వెంటనే పింఛన్‌దారుడి వివరాలు వస్తాయి. వారికి పింఛన్ చెల్లించినట్లు నమోదు చేసి.. పింఛన్ మొత్తం అందజేస్తారు. ఇక నడవలేని వారు, వివిధ రోగాలతో మంచాలకే పరిమితమైన వారికి చివరి రోజు ఇళ్లకు వెళ్లి ఫొటో తీసి పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రతి లబ్ధిదారుడికి సులభంగా పింఛన్ అందనుంది.
జిల్లాల వారీగా పెన్షన్ల వివరాలు (2024 సెప్టెంబరు వరకు)
కేటగిరీ నల్లగొండ సూర్యాపేట యాదాద్రి
వృద్ధాప్య 77,525 57,689 40,236
వితంతు 80,466 36,983 43,148
వికలాంగులు 30,630 10,282 13,198
చేనేత 3,051 49 444
కల్లుగీత 7,918 285 627
హెచ్‌ఐవీ 2,098 – 2,304
ఫైలేరియా 1,086 231 51
డయాలసిస్ 195 53 113
ఒంటరి మహిళ 7,662 2,124 4,318
24వ తేదీన బీపీఎంకు శిక్షణ
పింఛన్ల పంపిణీలో ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఈనెలలో ఇచ్చే పింఛన్లకు కొత్త విధానాన్ని వర్తింపజేయనున్నాం. ఈనెల 24వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం, శిక్షణ ఉంటుంది. అదేరోజు జిల్లాల్లోని బ్రాంచి పోస్టు మాస్టర్లకు (బీపీఎం) ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన సెల్‌ఫోన్లను అందజేయనుంది. నల్లగొండ జిల్లాలో 624 మంది బీపీఎం సెల్‌ఫోన్లు ఇస్తారు. వారు ఆ యాప్‌ను ఉపయోగించి పింఛన్లు పంపిణీ చేస్తారు.
– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ, నల్లగొండ