
ఎరువుల కొరత లేదు : కలెక్టర్
నల్లగొండ : జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎరువుల ఫిర్యాదుల కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తే సంబంధిత ఎరువుల దుకాణం యజమానితోపాటు, ఆయా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ సాగు, విత్తనాలు, నాట్లు వేసే సమయంలో సైతం అవసరమైన ఎరువులను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎరువులకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004251442కు ఫోన్ చేయాలని తెలిపారు. ఒకేసారి 30, 40 బస్తాల ఎరువులను తీసుకువెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఎరువుల షాపుల యజమానులు దుకాణం ముందు తప్పనిసరిగా ఎరువుల నిల్వ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ పాల్గొన్నారు.
వనమహోత్సవాన్ని వేగవంతం చేయాలి
నల్లగొండ : వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈత చెట్లు ఎక్కువగా నాటాలని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుక, సామగ్రిపై నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారయణ్‌అమిత్, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.