
విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన కారు
● మూడు గ్రామాలకు నిలిచిపోయిన కరెంట్ సరఫరా
నిడమనూరు: నిడమనూరు మండల కేంద్రం శివారులో సోమవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు నర్సింహులగూడెం వద్ద పంతులు పెంటోజీ పెట్రోల్ బంక్ ఎదుట 167వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న బారికేడ్లతో పాటు 11కేవీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని రోడ్డు పక్కన ఆగిపోయింది. దీంతో శాఖాపురం, నర్సింహులగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పెట్రోల్ బంక్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూస్తే అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలకు మరమ్మతుల కారణంగా నిడమనూరు మండల కేంద్రంలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంగళవారం ఉదయం ఘటనాస్థలం నుంచి కారును పోలీసులు తరలించారు.
కారు, మూడు బైక్‌లు ధ్వంసం..
భూదాన్‌పోచంపల్లి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు అజాగ్రత్తగా కారు నడపడంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన బైక్‌ల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారుతో పాటు మూడు బైక్‌లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉడతల లోకేశ్‌యాదవ్, పోచంపల్లికి చెందిన సంజీవ సోమవారం రాత్రి ఫూటుగా మద్యం తాగారు. మద్యం మత్తులో రాత్రి 10.20గంటల సమయంలో కారులో పద్మానగర్ నుంచి పోచంపల్లి వైపు అతివేగంగా వస్తూ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మెయిన్ రోడ్డు పక్కన సూరేపల్లి భూషణ్ షాపు ఎదుట పార్కింగ్ చేసిన బైక్‌లను, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మూడు బైక్‌లు, కారు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత సదరు యువకులు మద్యం మత్తులో కారులో పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు సూరెపల్లి భూషణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.