
వలస కార్మికులను నిర్బంధించిన 8 మందిపై కేసు
నల్లగొండ, చందంపేట: ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను నేరెడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ ప్రాంతంలో నిర్బంధించి వెట్టిచాకిరి చేయిస్తున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం బానాలకుంట గ్రామానికి చెందిన వడ్త్య జవహర్‌లాల్, పాయతండాకు చెందిన బాణావత్ రమేష్, ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందిన మైనంపల్లి శివ, కారె సింహాచలం, వంక విశాఖ అలియాస్ ఇషాక్, నేరెడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీకి చెందిన ఏరిపల్లి బావోజి, తాతారావు, చాపల బంగారి, గుడిపల్లి మండలానికి చెందిన జబ్బార్ అలియాస్ జవహర్‌లాల్, రమేష్, శివ కుమ్మకై ్క హైదరాబాద్‌కు చెందిన రాజు, జగన్, విజయవాడకు చెందిన లోకేష్‌ను ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు ఒక్కో మనిషికి రూ.1500 చొప్పున కమిషన్ తీసుకుని, హైదరాబాద్, విజయవాడ నుంచి వలస కార్మికులకు రూ.15వేలు జీతం ఇస్తామని, రెండు రెండు గంటలు మాత్రమే పని, భోజనం, వసతి కల్పిస్తామని నమ్మబలికి వారిని దేవరకొండ, మల్లేపల్లి వరకు పంపుతారు. అక్కడి నుంచి వలస కార్మికుల సెల్‌ఫోన్లను నిందితులు తమ ఆధీనంలోకి తీసుకొని రాత్రివేళ బైక్‌లపై నేరెడుగొమ్ము మండలం బాణాలకుంట, వైజాగ్ కాలనీకి తరలించి వారితో చేపలు పట్టడం, వలలు లాగించడం చేయించేవారు. రెండు పూటలు మాత్రమే భోజనం పెట్టి, పనికి తగిన వేతనం ఇవ్వకపోగా.. వేతనం అడిగితే వేడి చేసిన సీకులతో వాతలు పెట్టేవారు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న నేరేడుగొమ్ము పోలీసులు దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో ఈ నెల 12న స్పెషల్ ఆపరేషన్ చేపట్టి కార్మికులకు విముక్తి కల్పించారు. నిందితులపై నేరడుగొమ్ము పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 32 మంది వలస కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో నలుగురు బాలకార్మికులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఏజెంట్లు అయిన రాజు, జగన్, లోకేష్, వెంకన్నను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, డిండి, కొండమల్లేపల్లి సీఐలు, గుడిపల్లి, నేరడుగొమ్ము, గుర్రంపోడు ఎస్‌ఐలు, రెవెన్యూ, చైల్డ్ కేర్, సీడబ్ల్యూసీ బృందం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్

వలస కార్మికులను నిర్బంధించిన 8 మందిపై కేసు