
డీసీసీ నియామకం
అభిప్రాయ సేకరణ తర్వాతే..
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
ఫ ప్రజాక్షేత్రంలో పార్టీ కోసం పనిచేసే వారికే అవకాశం
ఫ వారం పది రోజుల్లో రానున్న ఏఐసీసీ పరిశీలకులు
ఫ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల ఖరారు
ఫ ఈలోగా గ్రామ, మండల కమిటీల ఎంపిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను కార్యకర్తల అందరి ఆమోదంతోనే నియమించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోగా ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షులను నియమించేలా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పీసీసీ సిద్ధం చేసిన డీసీసీ అభ్యర్థుల జాబితాను పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందోనన్న చర్చ జోరందుకుంది.
పీసీసీ జాబితా పక్కకు..
ఇప్పటివరకు పీసీసీ ఆమోదంతో జిల్లా అధ్యక్షులను పార్టీ నామినేట్ చేస్తోంది. అయితే ఆ విధానంపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అభివృద్ధి, విస్తరణ పక్కాగా జరగాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని ఈనెలాఖరులో చేపట్టనున్నారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాలను పీసీసీ గతంలోనే సిద్ధం చేసింది. డీసీసీ అధ్యక్షుల నియామక విధానాన్ని మార్పు చేసిన నేపథ్యంలో ఆ జాబితాను పక్కన పెట్టినట్లు తెలిసింది. తాజాగా జిల్లాలోని అందరి నేతల అభిప్రాయాలతో అధ్యక్షుల నియామకం చేపట్టే విధంగా కసరత్తు చేస్తున్నారు.
అభిప్రాయ సేకరణకు కసరత్తు
క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు కృషి చేసినవారు, పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన వారినే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించాలని పార్టీ భావిస్తోంది. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ అంటిపెట్టుకుని, పార్టీ పటిష్టతకు కృషి చేయడడంతో పాటు కార్యకర్తలకు వెన్నంటి ఉన్న నాయకులకు అవకాశం కల్పించనుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకొని జిల్లా అధ్యక్షులను నియమించేందుకు చర్యలు చేపడుతోంది.
అన్ని విధాలుగా పరిశీలించాకే..
క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంలో కీలమైన డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని ఏఐసీసీ పరిశీలకులు వచ్చాకే చేపట్టనుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. తెలంగాణకు కూడా వారం పది రోజుల్లో పరిశీలకులకు అధిష్టానం నియమించే అవకాశం ఉంది. ఏఐసీసీ అబ్జర్వర్లు వచ్చాక వారితోపాటు ఇటీవల అధిష్టానం నియమించిన జిల్లా ఇన్‌చార్జిలు, పీసీసీ ప్రతినిధులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదంతో పీసీసీ.. డీసీసీ అధ్యక్షులను ఖరారు చేసి జాబితాను అధిష్టానానికి పంపించనుంది. ఈ క్రమంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారెవరు, అధ్యక్ష పదవికి పోటీ పడుతుంది ఎవరు, వారు ఏ మేరకు పార్టీకి పని చేశారు, వారికి ఇవ్వడం సమంజసమేనా అనే విషయాలను పరిశీలించి అవకాశం కల్పిస్తారు.
న్యూస్‌రీల్

డీసీసీ నియామకం