
నేడు నల్లగొండకు మంత్రుల రాక
నల్లగొండ : నల్లగొండకు శనివారం రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు వారు నల్లగొండకు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.
ఎంజీయూలో వనమహోత్సవం
నల్లగొండ టూటౌన్ : మొక్కల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎంజీ యూనివర్సిటీ అధ్యాపకుడు రామచంద్రు అన్నారు. వనమహోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఎంజీ యూనివర్సిటీలో అధ్యాపకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య నివారణకు కృషి చేసిన వారవుతామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు సీహెచ్ రమేష్, భిక్షమయ్య, శేఖర్, స్వామి పాల్గొన్నారు.
మైనార్టీ గురుకులాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు
నల్లగొండ : జిల్లా మైనారిటీ గురుకులాల్లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన టీచర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి టి.విజయేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ బాలుర కాలేజీలో జెఎల్ ఫిజిక్స్ జనరల్ 1, మిర్యాలగూడ బాలికల కాలేజీలో జేఎల్ ఇంగ్లిష్ మహిళ 1, పీజీటీ పిజికల్ సైన్స్ మహిళ 1, దేవరకొండ బాలుర పాఠశాలలో టీజీటీ మ్యాథ్స్ జనరల్ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నల్లగొండలోని కార్యాలయంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని పేర్కొన్నారు.
పీఆర్‌సీ అమలు చేయాలి
పెద్దవూర : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం పెద్దవూర మండలంలోని వెల్మగూడెం, చలకుర్తి, పెద్దవూర, పులిచర్ల తదితర పాఠశాలలను ఆయన సందర్శించి మాట్లాడారు. మూడేళ్లుగా పెండింగ్ బిల్లుల జాప్యంతో ఉపాధ్యాయులు నిరాశకు లోనవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు రమావత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి గోలి కృష్ణ, నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, హరేందర్‌రెడ్డి, ఉపేందర్, సహదేవి, వెంకన్న, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడా అకాడమీలో ప్రవేశాలు
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలో 2025–2026 విద్యా సంవత్సరానికి బాలబాలికలకు ప్రవేశాలు కల్పించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ.అక్బర్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గచ్చిబౌలి క్రీడా అకాడమీలో హాకీ, అథ్లెటిక్ క్రీడాకారులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎల్‌బీ స్టేడియంలో అకాడమీలో హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ క్రీడాకారులకు ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలు వయస్సు, విద్యార్హత సర్టిఫికెట్లు క్రీడా ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్‌ఫొటోలు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియానికి వెళ్లాలని పేర్కొన్నారు.