
49,950 మందికి రేషన్ కార్డులు
నల్లగొండ : రేషన్‌కార్డుల కోసం పేదలు, మధ్యతరగతి ప్రజల నిరీక్షణకు తెరపడనుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. పదేళ్లుగా కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అక్కడి ప్రజలకు మాత్రమే కొన్ని కార్డులు మంజూరు చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కకార్డు కూడా ఇవ్వకపోవడంతో వేలాది మంది పేదలు రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 14వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
33 మండలాల్లో..
జిల్లాలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అధికారులు అన్ని అర్హతలు ఉన్న వాటిని ఆమోదించారు. జిల్లాలోని 33 మండలాల పరిధిలో 2 లక్షల వరకు దరఖాస్తులు రాగా అందులో 49,950 మందికి కొత్త కార్డులను మంజూరు చేశారు. మరో 75 వేల మంది కార్డుల్లో కొత్తగా పిల్లల పేర్లను నమోదు చేశారు. అయితే జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి సంబంధించి అధికారులు ఇప్పటికే జాబితా సిద్ధం చేశారు.
కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వం
ఫ 14న సీఎం చేతుల మీదుగా పంపిణీకి సన్నాహాలు
ఫ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
ఫ పదేళ్ల నిరీక్షణకు పడనున్న తెర
పంపిణీకి ఏర్పాట్లు చేశాం
జిల్లాలో 33 మండలాల పరిధిలో ఇప్పటికే 49,950 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాం. అలాగే 75వేల కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశాం. కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం.
– వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ