
జనవరి నాటికి యాదాద్రి ఐదో యూనిట్ సిద్ధం
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 5వ యూనిట్ పనులను 2026 జనవరి నాటికి పూర్తి చేసి విద్యుదుత్పాదన ప్రారంభించాలని రాష్ట్ర ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన యాదాద్రి థర్మల్ పవర ప్లాంట్‌ను జెన్‌కో సీఎండీ హరీష్‌తో కలిసి సందర్శించారు. పవర్ ప్లాంట్‌లోని ఉత్పత్తి యూనిట్, ప్లాంట్‌కు బొగ్గు సరఫరా, కూలింగ్ టవర్లు, స్విచ్‌యార్డు తదితర యూనిట్లను ఆయన పరిశీలించారు. వన మహోత్సవం సందర్భంగా ప్లాంట్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో ప్లాంట్ ఇంజనీరింగ్ అధికారులు, బీహెచ్‌ఈఎల్, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జనవరి నుంచి విద్యుత్‌కు ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకోని అనుకున్న సమయానికంటే ఒక నెల ముందుగానే 5వ యూనిట్ పనులను పూర్తి చేసి విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి పర్యావరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, టౌన్‌షిప్ పనులు నిర్ధేశించిన సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ ధరకు బొగ్గును తీసుకునే విధంగా అధికారులు మార్గాలను అన్వేషించాలని సూచించారు. జెన్‌కో సీఎండీ ఎస్.హరీష్ మాట్లాడుతూ.. వైటీపీఎస్‌కు వచ్చే రోడ్లు, అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. బీహెచ్‌ఈఎల్ అదనపు సిబ్బందిని నియమించి 5వ యూనిట్‌ను నిర్ధేశించిన సమయం కంటే ముందే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2047 విజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ బొగ్గు మెకానిజాన్ని రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబు, బీహెచ్‌ఈఎల్ పవర్ డైరెక్టర్ జితేందర్ గుప్తా, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, వైటీపీఎస్ కోల్ డైరెక్టర్ నాగయ్య, సివిల్ డైరెక్టర్ అజయ్, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, థర్మల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్
ఫ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శన