
మాకొద్దు.. జీపీఓ!
‘గ్రామపాలన’కు పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏల అనాసక్తి
16వ తేదీలోగా
దరఖాస్తు చేసుకోవాలి
గ్రామపాలన అధికారి పోస్టులను గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు పని చేసిన వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇతర శాఖలకు వెళ్లిపోయిన వారిలో తిరిగి రెవెన్యూ శాఖకు రావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని కోరినా.. మొదటి విడతలో చాలా మంది ఆసక్తి చూపలేదు. దీంతో రెండోసారి దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెవెన్యూ శాఖలో పనిచేసిన పూర్వ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా గ్రామ పాలన అధికారులుగా వచ్చేందుకు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి దరఖాస్తులు ఆహ్వానించారు. గూగుల్ ఫారంలో forms.gle/rBD ToMSakRcPoivWA ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. వచ్చే దరఖాస్తులను బట్టి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? ఎలా నియామకం చేస్తారన్న దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామపాలన అధికారి (జీపీఓ)గా పని చేసేందుకు పూర్వ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాలున్నాయి. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చి గ్రామాల్లో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అందుకు జిల్లాలో 241 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఉన్న పోస్టుల మేరకు కూడా దరఖాస్తులు రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం రెండు నెలల కిందట పరీక్ష నిర్వహించగా, అందులో 184 మంది ఉత్తీర్ణులయ్యారు. 57 మంది ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ధరణి వచ్చాక వీఆర్‌ఓ,
వీఆర్‌ఏ పోస్టులు రద్దు..
గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసింది. గ్రామాల్లో పనిచేస్తున్న ఆ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో అప్పటి వరకు గ్రామాల్లో పని చేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు ఇతర శాఖలకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఽఅధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే వీఆర్‌ఓల స్థానంలో జీపీఓలను నియమించాలని నిర్ణయించింది.
ఫ జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాలకు జీపీఓలు అవసరం
ఫ గతంలో దరఖాస్తు చేసుకుంది 241 మంది
ఫ స్కీనింగ్ టెస్ట్‌లో 184 మంది ఉత్తీర్ణత
ఫ మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం
ఒత్తిడి కారణంగానే..
రెవెన్యూ శాఖలో నిత్యం ఒత్తిడి మధ్యలోనే పనిచేయాల్సి ఉంటుంది. గ్రామాలకు ఏ ఉన్నతాధికారి వచ్చినా, ప్రజాప్రతినిధుల వచ్చినా, ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినా ముందుండి ఏర్పాట్లు చేయించాల్సింది గ్రామపాలన అధికారులే. ఒక పక్క రెవెన్యూ సమస్యలతోపాటు మరోపక్క ఈ పనులన్నీ చేయాల్సి ఉండటంతో గతంలో పనిచేసిన వారెవరూ ముందుకు రావడం లేదు. ఇదిలా ఉంటే పదోన్నతిపై జూనియర్ అసిస్టెంట్లుగా ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్‌ఓ, అర్హత కలిగిన వీఆర్‌ఏలు తమకు పరీక్ష నిర్వహించవద్దని కోరారు. తాము గతంలో రెవెన్యూ శాఖలో పని చేశామని.. నేరుగా తీసుకోవాలని పేర్కొన్నారు. పరీక్ష విధానం కారణంగా చాలా మంది తిరిగి వెనక్కి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల్లోకి వెళ్లిన ఆయా ఉద్యోగులు అక్కడ ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి గ్రామ పాలన అధికారులుగా వచ్చేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.