
భూ సమస్యలకు పరిష్కారం చూపాలి
హాలియా : పేదలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించ విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార ఫౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని భూ సమస్యలపై మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, రెవెన్యూశాఖ సెక్రటరీ డిఎస్ లోకేష్‌కుమార్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ రత్నాకర్‌తో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపించి సమస్యను జఠిలం చేయవద్దని ఆటవీశాఖ అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీశాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రీలు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫ రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఫ సాగర్ భూ సమస్యలపై సచివాలయంలో సమావేశం