
యూరియా అమ్మకాల నిలిపివేత
ఎమ్మార్పీకి అమ్మలేమంటున్న
ఎరువుల డీలర్లు
ఫ రవాణా భారం తగ్గించాలని డిమాండ్
ఫ కాంప్లెక్స్ ఎరువు కొంటేనే.. యూరియా సరఫరా చేస్తామని ప్రభుత్వం మెలిక
ఫ సకాలంలో యూరియా అందక
అవస్థలు పడుతున్న రైతులు
ఎరువులపై ఆందోళన వద్దు
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన నల్లగొండ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. రైతులు అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు. వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మార్పీకి ఎరువులను విక్రయించాలని వాటికి ఇతర ఎరువులతో లింకులు పెట్టవద్దు సూచించారు. ఆయన వెంట ఏఓ శ్రీనివాస్ ఉన్నారు.
మిర్యాలగూడ : వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఎరువుల వాడకం పెరిగింది. ఎరువులపై సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు కేంద్రం యూరి యా కావాలంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని లింక్ పెట్టింది. రూ.6 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను అమ్మితేనే.. రూ.లక్ష విలువ చేసే యూరి యాను సరఫరా చేస్తామని షరతు పెట్టింది. ద్రవ రూపంలో ఉండే నానో యూరియా, డీఏపీ వాడకాన్ని పెంచాలని సూచిస్తోంది. మరోవైపు ప్రైవేట్ డీలర్లకు కంపెనీలు యూరియా సరఫరాను తగ్గించాయి. వచ్చే కాస్త యూరియాకు రవాణా చార్జీల భారం పడుతుండడంతో జిల్లాలో డీలర్లు అమ్మకాలు నిలిపివేశారు. దీంతో ఎరువుల కోసం రైతులు తిప్పలు పడుతున్నారు.
ఎమ్మార్పీకి మించి అమ్మొద్దని ఆదేశాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 700కు పైగా ప్రైవేట్ డీలర్లు, 300 పీఏసీఎస్‌లు, 75 రైతు సేవా కేంద్రాలు, 50 వరకు ఎన్‌డీసీఎంఎస్ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే యూరియాలో 60 శాతం ప్రభుత్వరంగ సంస్థలకు, 40శాతం ప్రైవేట్ డీలర్లకు కేటాయిస్తారు. యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266 ఉండగా.. ఎమ్మార్పీ కంటే రూపాయి కూడా పెంచి విక్రయించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వమే రవాణా చార్జీలు భరిస్తుండగా.. ప్రైవేట్ డీలర్లు మాత్రం వారే రవాణా చార్జీలు భరించాల్సి వస్తోంది. దీంతో ఎమ్మార్పీకి యూరియా విక్రయిస్తే బస్తాపై రూ.20 నుంచి రూ.25 వరకు వారు నష్టపోతున్నారు. యూరియా బస్తాపై రవాణా చార్జీ రూ.10 నుంచి రూ.12, హమాలీకి మరో రూ.10 ఖర్చు అవుతుంది. దీంతో వారు తమ లాభాన్ని పరిగణనలోకి తీసుకోని బస్తా రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఎమ్మార్పీకి మించి విక్రయించొద్దని ఆదేశిస్తుండడంతో ప్రైవేట్ డీలర్లు అమ్మకాలు నిలిపివేశారు. రవాణా, ఇతర చార్జీలు కూడా ప్రభుత్వం భరించి తమకు నేరుగా యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు. లేదంటే ఎమ్మార్పీకి కాకుండా తమకు గిట్టుబాటు అయిన ధరకు యూరియా అమ్ముకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు.
మిర్యాలగూడలోని ఎరువుల గోదాము
రవాణా చార్జీలను ప్రభుత్వమే భరించాలి
ప్రభుత్వం అందించే ఎరువులకు యూరియా లింక్ పెట్టి డీలర్లను ఇబ్బంది పెడుతోంది. యూరియా దిగుమతి, రవాణ చార్జీల భారం డీలర్లపై వేస్తోంది. దీంతో బస్తాకు రూ.25 నుంచి రూ.40 వరకు ఖర్చు వస్తోంది. ఎమ్మార్పీకి యూరియాను విక్రయిస్తే మాకు నష్టం వస్తుంది. ప్రభుత్వం స్పందించి సొసైటీల మాదిరిగానే డీలర్లకు కూడా రవాణా చార్జీలపై మినహాయింపు ఇవ్వాలి.
– తెడ్ల జవహర్‌బాబు, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిౖసైడ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ఎక్కువ ధర పెట్టి కొంటున్నాం
ప్రతి సీజన్‌లో యూరియా అధిక ధరలకు అమ్ముతూ రైతులపై భారం మోపుతున్నారు. ఈ సీజన్‌లో ఎన్‌డీసీఎంఎస్ పేరిట డీలర్లు యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారు. సొసైటీల్లో సకాలంలో యూరియా దొరకకపోవడంతో ఎక్కువ ధర పెట్టి యూరియాను కొంటున్నాం.
– అనుముల శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, త్రిపురారం
రైతుల పడిగాపులు
వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ల డీలర్లు యూరియాను విక్రయించకపోవడంతో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు వచ్చిన యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతోంది. ప్రైవేట్ డీలర్లు యూరియా అమ్మితే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి డీలర్ల సమస్యను పరిష్కరించి యూరియా అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

యూరియా అమ్మకాల నిలిపివేత

యూరియా అమ్మకాల నిలిపివేత