
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు వచ్చారు. వారి నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల్లో జిల్లా అధికారులకు సంబంధించినవి 27, రెవెన్యూ 47, సబ్ కలెక్టర్‌కు 15, నల్లగొండ ఆర్డీఓకు 12, దేవరకొండ ఆర్డీఓకు 13, చండూరు ఆర్డీఓకు 4, జి సెక్షన్‌కు సంబంధించిన ఫిర్యాదులు 3 వచ్చాయి. వీటిపై అధికారులతో మాట్లాడిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. పరిష్కారానికి అనుకూలమైన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కింది స్థాయిలో పరిష్కారం కాకపోతే పైఅధికారులకు పంపాలని సూచించారు.