
పండ్లతోటల పెంపకానికి ప్రోత్సాహం
నల్లగొండ: పండ్ల తోటలు పెంచాలనుకునే రైతులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులతోపాటు సన్న, చిన్నకారు రైతులకు కూడా నూటికి నూరు శాతం సబ్సిడీ అందిస్తోంది. ఐదు ఎకరాలలోపు భూమి ఉండి నీటి వసతి కలిగిన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ. ఈ పథకంలో భాగంగా పది రకాల పండ్ల తోటలు పెంచుకునే అవకాశం రైతులకు ఉంది. మొ క్కలు నాటినప్పటి నుంచి ఎదిగేంత వరకు మూడు సంవత్సరాలపాటు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. ఇది పూర్తి స్థాయి సబ్సిడీ.
సబ్సిడీ ఇలా..
బత్తాయికి సంబంధించి ప్రభుత్వం ఎకరానికి రూ.15,036 చొప్పున మూడు సంవత్సరాలకు మొత్తం రూ.45,108 చెల్లించనుంది. నిమ్మకు ఎకరాకు సంవత్సరానికి రూ.16,540 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ.49,620 చెల్లించనుంది. అదేవిధంగా మామిడికి ఎకరాకు రూ.10,525 చొప్పున మూడేళ్లకు రూ.31,575, తైవాన్ జామ తోటలకు సంవత్సరానికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 8 వేలు, సీతాఫలం తోటలకు సంవత్సరానికి రూ.2005 చొప్పున మూడేళ్లకు రూ.6015, డ్రాగన్‌ప్రూట్ 0.5 ఎకరానికి సంవత్సరానికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 8 వేలు, మునగ తోట పెంపకానికి ఎకరాకు సంవత్సరానికి రూ.9016 చొప్పున మూడేళ్లకు రూ.27,048, కొబ్బరి బ్లాక్ ప్లాంటేషన్ ఎకరాకు సంవత్సరానికి రూ.10,525 చొప్పున మూడేళ్లకు రూ.31,575, కొబ్బరి బండ్ ప్లాంటేషన్ ఎకరాకు సంవత్సరానికి రూ.6014 చొప్పున మూడేళ్లకు రూ.18,042 చెల్లించనుంది.
ఫ ఎస్సీ, ఎస్టీ రైతులతోపాటు 5 ఎకరాలలోపు ఉన్న వారు అర్హులు
ఫ నూరు శాతం సబ్సిడీ అందించనున్న ప్రభుత్వం