
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
మిర్యాలగూడ : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద అందజేసే పింఛన్ల పంపిణీలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో చేయూత పథకంపై నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితమైనవారు, వివిధ కారణాలతో బయోమెట్రిక్ పడని వారికి మాత్రమే పంచాయతీ కార్యదర్శులు వారి బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లు చెల్లించాలన్నారు. చనిపోయినవారు, ఇతర కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 29 వేల మంది పెన్షన్‌దారులు శాశ్వతంగా వలస వెళ్లినవారి జాబితాలో ఉన్నారని, గత నెల నుంచి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చనిపోయిన, వలస వెళ్లినవారి పేర్లను తొలగించామన్నారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వన మహోత్సవం కింద మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు టాయిలెట్స్ మంజూరు చేశామన్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి ప్రభుత్వ సంస్థలో సోక్‌పిట్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్‌అమిత్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, సెర్ప్ కార్యాలయ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ల పంపిణీ సంచాలకుడు గోపాలరావు, ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి