
వన మహోత్సవానికి సన్నద్ధం
దేవరకొండ: జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఇందుకుగాను ఆయా మండలాలతోపాటు శాఖల వారీగా లక్ష్యాలను జిల్లా అధికారులు నిర్దేశించారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 39,51,700 మొక్కలు నాటాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 844 నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు పలు రకాల పూల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు.
ప్రణాళికలు సిద్ధం
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆయా గ్రామపంచాయతీల్లో గల నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎండ వేడిమి నుంచి సంరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నర్సరీలకు షేడ్ నెట్స్ ఏర్పాటు చేయడంతోపాటు మొక్కలకు ప్రతిరోజూ నీటిని అందిస్తున్నారు. ఈ ఏడాది అన్ని నర్సరీలు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి జిల్లాలోని ఆయా నర్సరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇస్తున్నారు. విద్యాసంస్థలు, ఖాళీ స్థలాలు, వసతి గృహాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలాల వారీగా లక్ష్యం ఇలా..
మండలం మొక్కలు
అడవిదేవులపల్లి 55,714
అనుముల 79,778
చందంపేట 1,05,915
చండూరు 1,20,960
చింతపల్లి 1,45,537
చిట్యాల 1,31,183
దామరచర్ల 1,60,521
దేవరకొండ 1,20,724
గుండ్లపల్లి 1,49,807
గుర్రంపోడ్ 1,39,794
కనగల్ 1,34,416
కట్టంగూర్ 1,51,264
కేతేపల్లి 1,21,232
కొండమల్లేపల్లి 1,04,255
మాడ్గులపల్లి 1,17,856
మర్రిగూడ 1,19,407
మిర్యాలగూడ 2,13,248
మునుగోడు 1,46,891
నకిరేకల్ 1,02,171
నల్లగొండ 1,42,727
నాంపల్లి 1,28,473
నార్కట్‌పల్లి 1,64,291
నేరేడుగొమ్ము 69,965
నిడమనూరు 1,41,629
పీఏ పల్లి 1,53,265
పెద్దవూర 1,25,938
శాలిగౌరారం 1,52,052
తిప్పర్తి 1,03,014
త్రిపురారం 1,40,411
టి.సాగర్ 1,24,978
వేములపల్లి 84,280
నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తాం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సమష్టిగా సంరక్షిస్తాం. జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అన్ని గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాం. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వన మహోత్సవ లక్ష్య సాధనకు కృషి చేస్తాం.
– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ, నల్లగొండ
జిల్లా వ్యాప్తంగా 39.51 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
ఫ 844 నర్సరీల్లో మొక్కల పెంపకం
ఫ మండలాల వారీగా లక్ష్యాల నిర్దేశం

వన మహోత్సవానికి సన్నద్ధం