
గర్భిణులకు అవగాహన కల్పించాలి
నల్లగొండ : అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది సమన్వయంతో గర్భిణులను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరీక్షలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతా శిశు మరణాలను నివారించేందుకు వైద్య ఆరోగ్యశాఖకు.. ఐసీడీఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖలు సహకరించాలని సూచించారు. ఆరోగ్య సమస్యపై పీహెచ్‌సీకి వస్తే.. అక్క సాధ్యం కాకపోతే ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ మాతృనాయక్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
శిరీష ఆస్పత్రిపై విచారణకు ఆదేశం..
గతేడాది డిసెంబర్‌లో మిర్యాలగూడలోని శిరీష ఆసుపత్రికి కాన్పు కోసం వచ్చిన అడావత్ రాజేశ్వరికి రాజేశ్వరి వెళ్లగా, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శిరీష చివరి క్షణం వరకు రాజేశ్వరిని ఆసుపత్రిలో ఉంచుకొని.. పరిస్థితి విషమించాక నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి పంపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రసవానంతరం డిసెంబర్ 28న ఆమె మృతి చెందింది. రాజేశ్వరిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రికి పంపండంలో నిర్లక్ష్యం వహించిన శిరీష ఆసుపత్రిపై మెజిస్టీరియల్, శాఖా పరమైన విచారణకు ఆదేశిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.