
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
నల్లగొండ టౌన్ : ప్రత్యామ్నయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహ కల్పించాలని సూచించారు. రానున్న వానాకాలం సాగు సంసిద్ధంపై శుక్రవారం కలెక్టరేట్‌లో శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయాధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రైతులు పండించే వరి, పత్తి వంటి పంటల వల్ల శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటోందని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లించాలని కంది, కూరగాయలు, పండ్ల తోటలు అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల వైపు వారిని మళ్లించాలన్నారు. ఉద్యాన పంటలు, నూతన వంగడాల సాగుకు సంబంధించి ప్రతి రెండు మండలాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి మార్కెటింగ్‌కు ప్రోత్సాహం కల్పించేలా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ, డ్రిప్ సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, పద్మారెడ్డి, అంజిరెడ్డి, నవీన్‌రెడ్డి, శ్రీనివాస్, సత్తిరెడ్డి, శ్రీనివాస్‌రావు, గోపాల్‌రెడ్డి, జగన్, రాంరెడ్డి, వీరయ్య, ఎల్లయ్య, డీఏఓ శ్రవణ్‌కుమార్, ఉద్యాన అధికారి అనంతరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి