105 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

105 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు

Published Thu, Mar 20 2025 2:05 AM | Last Updated on Thu, Mar 20 2025 2:04 AM

హాజరుకానున్న 18,525 మంది విద్యార్థులు

జవాబులు రాసేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన 24 పేజీల బుక్‌లెట్‌

పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌ భద్రత

‘సాక్షి’తో డీఈఓ భిక్షపతి

నల్లగొండ : ‘పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీన జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశాం. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు కన్వర్జేషన్‌ మీటింగ్‌ నిర్వహించి పరీక్ష కేంద్ర వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’ అని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

144 సెక్షన్‌ అమలు

పదో తరగతి పరీక్షలు జిల్లాలో 18,825 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 18666 మంది రెగ్యులర్‌, 259 మంది ప్రైవేట్‌ విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం 105 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తాం. ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌ పేపర్లు మాత్రం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నాం.. పోలీస్‌ భద్రత ఏర్పాటు చేస్తాం. సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని ఆదేశించాం.

బుక్‌లెట్‌పై క్యూఆర్‌ కోడ్‌..

పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు జవాబులు రాసేందుకు గతంలో మెయిన్‌ ఆన్సర్‌ షీట్‌, అడిషనల్‌ షీట్లు ఇచ్చేవారు. ఈసారి వాటి స్థానంలో 24 పేజీల బుక్‌లెట్‌ అందిస్తున్నాం. ఆ బుక్‌లెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు.

986 మంది ఇన్విజిలేటర్లు

జిల్లా వ్యాప్తంగా 986 మంది ఇన్విజిలేటర్లు, ఆరు ఫ్లయింగ్‌ స్క్యాడ్‌ బృందాలు ఏర్పాటు చేశాం. అందులో విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్‌ శాఖలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉంటారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు 105 మంది, డిపార్టుమెంట్‌ అధికారులు 105 మంది ఉంటారు. సిట్టింగ్‌ స్క్యాడ్‌గా 13 మందిని ఏర్పాటు చేశాం.

13 సీ సెంటర్లు..

పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతంలో ట్రెజరీ ఆఫీస్‌, పోలీస్‌ స్టేషన్‌, పోస్టాఫీస్‌ లేని వాటిని సీ సెంటర్లుగా గుర్తించాం. ఈ పరీక్ష కేంద్రాలవారు ఇతర సెంటర్‌వారు ప్రశ్నపత్రాలు పెట్టే పోస్టాఫీస్‌ల్లోనే వారి పేపర్లను ఉంచుతారు. అక్కడ నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష పూర్తయిన తర్వాత అదే పోస్టాఫీస్‌లో అప్పజెప్పాలి. కస్టోడియన్లు, జాయింట్‌ కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలకు పేపర్లు తీసుకురావడంతోపాటు తిరిగి పోస్టాఫీస్‌లకు తీసుకెళ్లాలి. ప్రతి పరీక్ష కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ రూమ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రశ్నపత్రాలను ఆ సీసీ కెమెరాల ముందే ఓపెన్‌ చేస్తాం. ప్రతి పరీక్ష కేంద్రంలో ఎంఈఓ, ఎస్‌ఐ ఫోన్‌ నంబర్లను రాసి ఉంచాం. డీఈఓ ఆఫీస్‌లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశాం.

45 నిమిషాల ముందుగానే కేంద్రంలోకి..

విద్యార్థులు హాల్‌ టికెట్‌ తీసుకున్న తర్వాత పరీక్షకు ముందు రోజే సెంటర్‌కు వెళ్లి చూసుకోవాలి. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందునుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తాం. హాల్‌టికెట్‌, పెన్ను, పెన్సిల్‌, పరీక్ష ప్యాడ్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదు. దివ్యాంగులు, చేతులు పనిచేయనివారు పరీక్షలు రాసేందుకు స్క్రైబ్‌లుగా.. 9వ తరగతి విద్యార్థులను ఏర్పాటు చేస్తాం.

105 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు1
1/1

105 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement