
స్కూటీకి నిప్పంటించిన దుండగులు
రామన్నపేట: ఇంటి ముందు పార్కింగ్ చేసిన స్కూటీపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రామన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బాలగోని వెంకట హరిదీప్ తన స్కూటీని శుక్రవారం రాత్రి తన ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి 11గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు బాటిల్‌లో పెట్రోల్ తీసుకొచ్చి స్కూటీపై చల్లి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. స్కూటీ ముందుభాగం పూర్తిగా కాలిపోయింది. బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.