
యాదగిరి క్షేత్రంలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో శ్రీస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, మాడ వీధుల్లో సందడి వాతావరణం కనిపించింది. కాగా శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారి ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, క్యూలైన్లు, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. శ్రీస్వామివారిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.49,77,624 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.