
అప్పులు చేసి పరారైన వ్యాపారి
భువనగిరి టౌన్: డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసే వ్యక్తి తన వద్ద పనిచేసే మహిళల నుంచి అప్పులు తీసుకుని వాటిని తీర్చలేక పరారయ్యాడు. దీంతో అతడికి అప్పు ఇచ్చిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా.. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన శనివారం భువనగిరిలో వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిగిరి రాధాకృష్ణ, అతడి కుమారుడు అవినాష్ భువనగిరిలోని గంజ్ మార్కెట్ వెనుక రుద్ర డ్రై ఫ్రూట్స్ పేరిట వ్యాపారం చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, మసాలాలు ప్యాకింగ్ చేసేందుకు వారి వద్ద ఏడుగురు మహిళలు పనిచేస్తున్నారు. వ్యాపారం అభివృద్ధి చేస్తానని చెప్పి అధిక వడ్డీ ఆశ చూపి వారి వద్ద పనిచేసే మహిళలకు ఒకరికి తెలియకుడా మరొకరి నుంచి రూ.30 లక్షలకు పైగా అప్పులు తీసుకున్నారు. వారి వద్ద పనిచేసే భువనగిరి పట్టణంలోని అర్బన్‌కాలనీకి చెందిన తోట సరిత రూ.2.40 లక్షలు అప్పుగా ఇచ్చింది. అంతేకాకుండా మరో రూ.లక్ష ఇతరుల నుంచి అప్పుగా ఇప్పించింది. అయితే తీసుకున్న డబ్బులను రాధాకృష్ణ, అతడి కుమారుడు అవినాష్ తిరిగి ఇవ్వకపోగా.. మూడు రోజుల నుంచి వారు ఇంట్లో లేకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆందోళనకు గురైన సరిత శనివారం ఇంట్లో బాత్రూంలు కడిగే హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆమెను భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఇటీవలే విడాకులు తీసుకున్న మరో మహిళ పుస్తెలతాడు అమ్మి అప్పు ఇవ్వగా.. మరికొందరు చిట్టీలు ఎత్తి, బజాజ్ ఫైనాన్స్ కార్డుల ద్వారా డబ్బులు తీసి అప్పులు ఇచ్చినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం రాధాకృష్ణ కుటుంబం పరారైందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్ తెలిపారు.
ఫ డబ్బులు ఇచ్చి మోసపోయిన మహిళ ఆత్మహత్యాయత్నం
ఫ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న
బాధితులు

అప్పులు చేసి పరారైన వ్యాపారి