ధాన్యం సేకరణకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు సన్నద్ధం

Mar 19 2025 1:49 AM | Updated on Mar 19 2025 1:48 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. రైతుల నుంచి ధాన్యం సేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్‌–ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాలుకు రూ.2320, సాధారణ రకం (దొడ్డు) ధాన్యం క్వింటాలుకు రూ.2300గా కనీస మద్దతు ధర ప్రకటించాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరతో రైతుల నుంచి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో 5,14,030 ఎకరాల్లో వరి సాగు

జిల్లాలో యాసంగి సీజన్‌లో రైతులు 5,14,030 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తద్వారా 12,14,449 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, అందులో 11,26,021 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. మార్కెట్‌కు వచ్చే ధాన్యంలో మిల్లర్లు 5,68,152 మెట్రిక్‌ టన్నులు, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ 5,57,869 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని 146 రైస్‌ మిల్లుల్లో 6.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

సన్నాలు క్వింటాలుకు రూ.500 బోనస్‌

సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌కు ఈ సీజన్‌లో 4,42,141 మెట్రిక్‌ టన్నుల గ్రేడ్‌–ఏ (సన్న ధాన్యం) వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేశారు. అందులో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌కు 81,933 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని లెక్కలు వేశారు. దానికి మాత్రమే ప్రభుత్వం బోనస్‌ అందించనుంది. ప్రైవేటు మిల్లర్లు కొనుగోలు చేసే సన్న ధాన్యానికి బోనస్‌ వర్తించదని అధికారులు పేర్కొన్నారు.

375 కొనుగోలు కేంద్రాలు

ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 172, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 179, రైతు పరస్పర సహకార సంఘాల ఆధ్వర్యంలో 24 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం కేంద్రాల్లో 304 సాధారణ రకం (దొడ్డు ధాన్యం), 71 కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోలు చేయనున్నారు. మార్కెట్‌కు వచ్చే ధాన్యం ఆధారంగా అవసరమైతే కొనుగోలు కేంద్రాలను పెంచుతారు.

ఫ గ్రేడ్‌ ఏ రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర

ఫ సన్న ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌

ఫ జిల్లాలో 12,14,449 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా

ఫ కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశం

ఫ నెలాఖరుకు కేంద్రాలు ప్రారంభం

సమస్యలుంటే 9963407064కు ఫోన్‌ చేయండి

ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో రైతులకు సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు గ్రీవెన్స్‌ సెల్‌ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. 9963407064 నంబర్‌కు ఫోన్‌ చేసి వారి సమస్యలను తెలియజేయవచ్చు. కొనుగోలు కేంద్రాల్లో 14,117 టార్పాలిన్లు, 200 క్యాలిపర్లు, 253 తూకం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement