
నల్గొండ: మట్టి, బురద కాళ్లతో ఇంటి వరండా ముందు నుంచి పై అంతసస్తుకు తరుచూ తిరుగుతున్న ఇద్దరిని వారించిన వ్యక్తిపై దాడి చేయడంతో తలకు గాయమై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బీబీనగర్ మండలంలోని జమీలాపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యుగేంధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జమీలాపేట గ్రామానికి చెందిన సయ్యద్ సలీం(60) అదే గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని శుభ్రం చేస్తున్నాడు.
ఈ సమయంలో అద్దె ఇంటి పైన మరో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పనికి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు లలిత్, అమర్‌లు శుభ్రం చేసిన వరండా నుంచి నుంచిపైకి కిందకు మట్టి, బురద కాళ్లతో నడుచుకుంటూ వెళ్తుండడంతో గమనించిన సలీం వారిని మందలించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సలీమ్‌ను ఇద్దరు కలిసి గోడకు నెట్టివేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి.
గొడవను గమనించిన సలీం భార్య అమీనా బేగం, ఇరుగుపొరుగు వారు అక్కడి చేరుకొని గాయపడిన సలీంను ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా మృతిచెందినట్లు ధ్రువీకరించాడు. విషయం తెలుసుకున్న భవన నిర్మాణ కార్మికులు లలిత్, అమర్ అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి కుమారుడు సమీర్ ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.