ఆగని అసంతృప్తులు.. సాగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

ఆగని అసంతృప్తులు.. సాగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌

Published Wed, Sep 27 2023 2:06 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో అసంతృప్తులు ఆగడం లేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులు, అసంతృప్తుల మధ్య ఫైట్‌ కొనసాగుతూనే ఉంది. కనీసం వారిని బుజ్జగించే చర్యలు కూడా కనిపించకపోవడంతో ఎవరి ప్రచారంలో వారు మునిగారు. అధికార పార్టీలోనే ఉంటూ తిరుగుబాటు జెండా ఎగురవేసిన అసంతృప్తులు బీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు.

ఇప్పటికీ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని డిమాండ్‌ చేస్తుండగా, మరికొన్ని చోట్ల తమకు టికెట్‌ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. నల్లగొండ వంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటామంటూ ఆశావహులు తిరుగుబాటు చేస్తుండగా, ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ రాజకీయం గందరగోళంగా మారింది.

వేచి చూసే ధోరణిలో అధిష్టానం..
నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నా బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్‌లు పోటీలో ఉంటారంటూ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాటి నుంచి ఆశావహులు ఎవరికి వారే కార్యక్రమాలను చేసుకుంటున్నా నిలువరించిన సందర్భాలు లేవు. ఇదీ అభ్యర్థులుగా పోటీలో ఉండబోయే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఇటు సిట్టింగ్‌ అభ్యర్థులు, అటు ఆశావహులు ఎవరికి వారు ప్రచారం కొనసాగిస్తుండడంతో అసలు అధిష్టానం టికెట్‌ ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు ప్రకటించిన వారికే వస్తుందా? ఏమైనా మార్పులు ఉంటాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా పైకి టికెట్‌ తమకేనని గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల వారికి ఆందోళన తప్పడం లేదని ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి’తో పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతోంది.

పలు నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి..
నాగార్జునసాగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌కు అధిష్టానం టిికెట్‌ కేటాయించింది. అయితే ఆశావహలు మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్‌ యాదవ్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారి అనుచరులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక నేత మన్నెం రంజిత్‌ యాదవ్‌కు టికెట్‌ ఇవ్వాలని నియోజకవర్గంలోని ప్రజలు కోరుతున్నారు. రంజిత్‌ యాదవ్‌ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ, ఆయనకే టికెట్‌ ఇవ్వాలని సూచిస్తున్నారు.

నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికే అధిష్టానం టికెట్‌ ఇస్తామని ప్రకటించింది. అయితే పట్టణానికి చెందిన కౌన్సిలర్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్‌ తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. తాజాగా తన ఫ్లెక్సీలు భూపాల్‌రెడ్డి వర్గం నేతలు చింపారంటూ మంగళవారం నల్లగొండలో నిరసన ర్యాలీ చేపట్టారు.

నకిరేకల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే టికెట్‌ అని అధిష్టానం ప్రకటించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడినా ప్రయోజనం లేకుండాపోయింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీకి వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కూడా కలిశారు.

దేవరకొండలోనూ అసంతృప్తి చల్లారడం లేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు టికెట్‌ ప్రకటించక ముందు నుంచే ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి స్థానిక నేతలు విన్నవించారు. మంత్రి హరీశ్‌రావును కలిసి తమ వ్యతిరేకతను తెలియజేశారు. దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్‌ వర్గం రవీంద్రకుమార్‌ అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్‌ చేసింది. దేవేందర్‌నాయక్‌ ఇటీవల తన అనుచరులతో సమావేశాలు నిర్వహించడంతోపాటు తనకే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కోదాడలోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ను మార్చాలని ఆయన వ్యతిరేకవర్గం పట్టుపడుతోంది. అక్కడి పార్టీ నేతలు శశిధర్‌రెడ్డి, చందర్‌రావు ఎమ్మెల్యేతో విభేదిస్తూ తమకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

ఆలేరులో నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆలేరు అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పేరు ఖరారైన తరువాత మోత్కుపల్లికి ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు సమావేశం పెట్టి డిమాండ్‌ చేస్తున్నారు.

పట్టించుకోవడం లేదెందుకో?

వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోతున్నా, పార్టీలో ఉండి అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా, ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నా.. అధిష్టానం ఎందుకు ఈ విషయంలో మిన్నకుండిపోతుందన్న దానిపైనే చర్చ సాగుతోంది. అసంతృప్తులను దారికి తెచ్చుకోవడం, లేదా పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండని వారిపై చర్యలు తీసుకోవడం వంటి కార్యాచరణను ఎందుకు అమలు చేయడం లేదన్న దానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సిట్టింగుల్లోనూ ఆందోళన నెలకొంది. అభ్యర్థులుగా పేర్లు ప్రకటించినా, చివరికి టికెట్‌ ఇస్తారా? లేదా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు అధిష్టానం సర్వే చేయిస్తోందని, దాని ఫలితాలు వచ్చాకే అసంతృప్తుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుందన్న వాదనను పార్టీ వర్గాల నుంచి వస్తున్నా.. సిట్టింగ్‌లకు మాత్రం చికాకు తప్పడం లేదు.

Advertisement
Advertisement