‘రుణ’ం తీర్చలేక.. ప్రాణాలతో ‘విముక్తి’ | - | Sakshi
Sakshi News home page

‘రుణ’ం తీర్చలేక.. ప్రాణాలతో ‘విముక్తి’

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

2025 డిసెంబర్‌ 12 : గద్వాలకి చెందిన ఓ ఉపాధ్యాయుడు రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఫైనాన్స్‌, చిట్టీ వ్యాపారాలు చేసేవాడు. పెట్టుబడుల కోసం భారీగా అప్పు చేశాడు. నష్టాలు రావడం.. అప్పులు చెల్లించే స్థోమత లేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అత్యాశతో సామర్థ్యానికి మించి అప్పులు..

త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సామర్థ్యానికి మించి అప్పులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా యువకులు రియల్‌ ఎస్టేట్‌, ఇతరత్రా వ్యాపార పెట్టుబడుల కోసం భారీగా రుణాలు సేకరిస్తున్నారు. తమకు తెలిసిన వారి వద్ద, పలు ప్రైవేట్‌ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం.. రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్‌లకు నెలనెలా ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలో మరో చోట రుణం తీసుకొచ్చి వడ్డీలు చెల్లించడం.. క్రెడిట్‌ కార్టుల నుంచి నెల వారీగా సర్దుబాటు చేయడం వంటివి చేస్తూ.. చివరకు అప్పులు తీర్చలేక చతికిలపడుతోంది.

మధ్య తరగతి జీవితాలతో చెలగాటమాడుతున్న అప్పులు

10 నెలల్లో సుమారు 25 మంది వరకు..

ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 25 మంది అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఒక్క గద్వాల జిల్లాలోనే 20 మంది వరకు ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అత్యధికంగా అత్యాశతో అప్పులు చేసిన వారు.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకులు తనువు చాలించినట్లు తెలుస్తోంది.

సాధారణ ఖర్చులు పెరగడంతో..

ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు, చిరు వ్యాపారాలతో పాటు పలు ప్రైవేట్‌ సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెల వంటి సాధారణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. బ్యాంకుల్లో రుణాలు సులభంగా అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్‌ ఫైనాన్స్‌, రోజు వారీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన అప్పు.. ఆ తర్వాత నెల నెలా వడ్డీలతో కలిపి అధిక భారంగా మారుతుండడం ఆయా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

2026 ఏప్రిల్‌ 6: గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. కొన్ని నెలలు సక్రమంగా వడ్డీలు చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించకపోవడంతో ఒత్తిళ్లు రావడం.. తీర్చే స్థోమత లేకపోవడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు.

నారాయణపేట జిల్లా మక్తల్‌కి చెందిన కర్రెమ్‌ సూర్యనారాయణ అలియాస్‌ తిమ్మప్ప అలియాస్‌ సూర్య, అలియాస్‌ తిప్పియ్య అనే 27 ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. గత ఏడాది కాలంగా డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మక్తల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కిరాణం, వైన్‌ షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఇటీవల పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

లోన్‌, బెట్టింగ్‌ యాప్‌ల బారిన పడి..

ప్రస్తుత తరంలో సెల్‌ఫోన్‌ నిత్యావసరంగా మారడం.. సామాజిక మాధ్యమాల్లో లోన్‌ యాప్‌ల ఆకర్షణీయ ప్రకటనలు కట్టిపడేసేలా ఉంటున్నాయి. ఆధార్‌, పాన్‌, ఫోన్‌ నంబర్‌ ఉంటే చాలు.. నిమిషాల్లో రుణాలు ఇస్తుండడంతో అప్పుల పాలైన వారు వాటిని ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత వడ్డీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు దిగడం.. చెల్లించని పక్షంలో రుణ గ్రహీతలు ఇచ్చిన కాంటాక్ట్‌ నంబర్లకు ఫోన్‌లు చేసి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో వీటిపై ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. మరోవైపు త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది యువత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు దిగుతున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్‌.. చివరకు లక్షల్లో నష్టాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కుటుంబాలకు తెలియకుండా చేసిన అప్పులు కట్టలేక.. కుటుంబ సభ్యులకు చెప్పలేక అవమాన భారంతో బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

ఆన్‌లైన్‌ లోన్‌, బెట్టింగ్‌ యాప్‌ల బారిన పడి కుంగుబాటు

అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న యువతరం

ఉమ్మడి జిల్లాలో ఇటీవల పెరుగుతున్న బలవన్మరణాలు

పిల్లల నూరేళ్ల జీవితాన్ని చేజేతులా కాలరాస్తున్న వైనం

2025 ఆగస్ట్‌ 15: నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండకి చెందిన ఓ విద్యార్థి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అప్పులు ఇచ్చిన వారికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి మరోసారి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడగా.. డబ్బులు పోయాయి. దీంతో మనస్తాపానికి గురై అతడు ఉరి వేసుకుని మృతిచెందాడు.

గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలూన్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కొంతకాలంగా మట్కా జూదానికి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అవసరమైతే కౌన్సెలింగ్‌ తీసుకోవాలి...

అందరికీ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరవొద్దు. ఆన్‌లైన్‌ యాప్‌లు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి. ఏ వ్యాపారమైతే చేయదలుచుకున్నారో దానిపై పూర్తి అవగాహన ఉండాలి. పెట్టుబడులకు రుణాలు చేసే ముందు కుటుంబసభ్యులతో చర్చించాలి. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడి పెరిగితే స్నే హితులతో పంచుకోవాలి. అప్పులు జీవితంలో ఒక సమస్య మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు. అవసరమైన పక్షంలో కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. – డా.అనిల్‌రాజ్‌, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా జనరల్‌ ఆస్పత్రి

Advertisement
 
Advertisement
Advertisement