‘అచ్చంపేట లిఫ్ట్‌’ పూర్తిచేసి తీరుతాం | - | Sakshi
Sakshi News home page

‘అచ్చంపేట లిఫ్ట్‌’ పూర్తిచేసి తీరుతాం

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

అచ్చంపేట: అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పూర్తిచేసి తీరుతామని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం పట్టణంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అచ్చంపేట లిఫ్ట్‌కు పాలాభిషేకాలు చేసిన నాయకులే ప్రస్తుతం పనులను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు నల్లమట్టి అమ్మి రూ.కోట్ల సొమ్ము చేసుకున్న మర్రి జనార్దన్‌రెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. తాను అక్రమ ఇసుక దందా చేస్తున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటావా అని సవాల్‌ విసిరారు. రాజకీయ కక్షతో ఎన్ని అక్రమ కేసులు పెట్టారో తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తనపైనే 49 కేసులు నమోదు చేశారని.. నాలుగు కేసుల్లో ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నామని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి బీఆర్‌ఎస్‌కే ఉందని.. తమ ప్రభుత్వానికి లేదన్నారు. మరో బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. పోలీస్‌ అధికారిగా పనిచేసిన ఆయన.. పోలీసులను విమర్శించడం తగదన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జి.రాజేందర్‌, మాజీ చైర్మన్‌ గార్లపాటి శ్రీనివాసులు, ఎ.గోపాల్‌రెడ్డి, అంతటి మల్లేష్‌, పోశం గణేశ్‌, బుచ్చిరాములు, రాజ్‌గోపాల్‌ ఉన్నారు.

చైర్మన్‌ మాధవరెడ్డి

పదవీ కాలం పొడిగింపు

అచ్చంపేట రూరల్‌: శ్రీశైల ఉత్తర ముఖద్వారం ఉ మామహేశ్వర దేవాలయ చైర్మన్‌ బీరం మాధవరెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండోసారి పొడగించింది. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ చేతుల మీదుగా నియామకపత్రాన్ని మాధవరెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో రెండోసారి చైర్మన్‌గా నియమించిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే సహకారంతో ఆలయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ఆర్టీసీ విలీనంతోనే ఉద్యోగ భద్రత

కందనూలు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోనే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. అదే విధంగా 2021 వేతన సవరణలో ఉన్నా తేడాలను సవరించాలని.. విలీన కమిటీలో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, రీజియన్‌ కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు సుమలత, పద్మ, కృష్ణయ్య ఉన్నారు.

అధిక ఫీజులను నియంత్రించాలి

కందనూలు: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ మొక్తాల శంతన్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి.. విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ఏబీవీపీ నాయ కులు సంగనమోని బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శి శివ, విష్ణు, నాయుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement