● మసీదులు, ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
● పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు
కందనూలు: జిల్లావ్యాప్తంగా గురువారం బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనల అనంతరం జామియా నిజామియాకు చెందిన ఈద్ ఉల్ ఆజ్వా బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. అల్లా ముస్లింలకు ప్రసాదించిన ఐదు అంశాల్లో హజ్ కూడా ప్రధానమైందన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ ఖుర్భానీ ఇవ్వాలని ఖురాన్ చెబుతోందని.. త్యాగ నీరతికి ప్రతీక అయిన బక్రీద్ నిష్టతో జరుపుకోవాలని సూచించారు. సమాజంలో అల్లా దయ ఉన్నంత వరకు మంచి చేకూరుతుందన్నారు.
● ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్‌చైర్మన్ బాదం రమేశ్, కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వినోద్ తదితరులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇస్లాం మతానికి మూల స్తంభాలైన రోజా, జకాత్, నమాజ్, ఇమాన్, హజ్ సూత్రాలను పాటిస్తూ, ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం అభినందనీయన్నారు. కాగా, బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


