అచ్చంపేట/తెలకపల్లి: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం అచ్చంపేట మండలం చెన్నారం, నడింపల్లి గ్రామాల్లోని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో మొక్కజొన్న నిల్వ కేంద్రాలను ఆయన పరిశీలించారు. మిల్లుల్లో ధాన్యం నిల్వ సామర్థ్యం, కొనుగోలు ప్రక్రియ, మిల్లింగ్ వ్యవస్థపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన వరిధాన్యం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలను సక్రమంగా పరిశీలించి.. పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాలకు తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కలెక్టర్ వెంట అచ్చంపేట తహసీల్దార్ సైదులు ఉన్నారు.


