వేధిస్తున్న హమాలీల కొరత
● మందకొడిగా సాగుతున్న
మొక్కజొన్న కొనుగోళ్లు
● లారీలు, హమాలీల కొరతతో
తరలింపులో తీవ్రజాప్యం
● కొనుగోలు కేంద్రాల వద్దే
రైతుల పడిగాపులు
● అకాల వర్షాల భయంతో
అన్నదాతల ఆందోళన
–8లో u
గత నెల 30న 280 బస్తాల మక్కలను అచ్చంపేట కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాను. ఈ నెల 4న కాంటా పెట్టి వదిలేశారు. ప్రతిరోజు కాపలా ఉంటున్నా తప్ప ఇంత వరకు బస్తాలను తరలించలేదు. ఇంత వరకు ఒక్క పైసా కూడా అకౌంట్‌లో జమ కాలేదు.
– సైదులు, కంసానిపల్లి గ్రామం,
ఉప్పునుంతల మండలం
మార్కెట్‌కు తెచ్చిన మక్కలను ఈ నెల 12న కాంటా వేశారు. మక్కలు తరలించే వరకు మమ్మల్నే కాపలా ఉండాలని చెప్పారు. రోజూ రాత్రి, పగలు ఇక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. లారీలు వస్తే తప్ప తరలించే పరిస్థితి లేదు. లారీలు ఎప్పుడొస్తాయో ఎవరూ చెప్పడం లేదు.
– చంద్రయ్య, కొత్తరాంనగర్ గ్రామం,
ఉప్పునుంతల మండలం
కొనుగోలు చేసిన మక్కలను తరలించేందకు లారీలు వస్తలేవు. లారీల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. లారీలు వస్తేనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తాం. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంది. మార్కెట్‌లో స్థలం లేకపోవడంతో ఇప్పుడే ధాన్యం తేవొద్దని రైతులకు సూచించాం.
– ఎల్లయ్య, సీఈఓ, పీఏసీఎస్, అచ్చంపేట
అచ్చంపేట: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రెండు వారాల్లో వానాకాలం ముంచుకు రానుండగా కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న కుప్పలు పేరుకుపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన మక్కలను కాంటా చేసేవారు లేక కొన్ని రోజులు.. తూకం వేసిన బస్తాలను ఎక్కడికి పంపించాలో తెలియని పరిస్థితిలో కొన్ని రోజులు, వాహనాలు లేకపోవడంతో మరికొన్ని రోజులు ఇలా నెలల తరబడి కేంద్రాల్లోనే మక్క రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారు. మక్కలు తెచ్చి నెలరోజులు దాటినా తూకాలు పూర్తి కాకపోవడం, తరలింపు వేగవంతం చేయక ఆందో ళన చెందిన రైతులు పలుచోట్ల రోడ్డెక్కుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు పొంచి ఉండటంతో ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.
జిల్లాలో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. బీహార్, బెంగాల్ హమాలీలకు తోడు స్థానిక హమాలీలు పనిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.50– 60 వరకు చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ కూలీ గిట్టుబాటు అవుతుందని వలస హమాలీలు సైతం కొనుగోలు కేంద్రాలకే మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి లోడ్‌తో వచ్చిన లారీలను అన్‌లోడ్ చేయడానికి సరిపోను హమాలీలు లేరు. తూకం వేసి ధాన్యం తరలించడానికి సకాలంలో లారీలు కావడం లేదు. లారీలు రాక రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. కొనుగోలు జరిపిన వెంటనే తరలిస్తామని అధికారులు చెబుతున్నా జాప్యం జరుగుతోంది. దీంతో కొనుగోళ్లలో జాప్యం, అధికంగా డబ్బుల వసూళ్లు, అమ్మిన మొక్కలకు డబ్బులు ఆలస్యంగా చెల్లింపుల వంటి కారణాలతో చాలామంది రైతులు మక్కలను తక్కువ ధరకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇంకా చాలా వరకు మొక్కల కొనుగోలు చేపట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో కొన్నది గోరంత.. కొనాల్సింది కొండంత


