అమరచింత: ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రి యదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కాల్వల్లో నీటిసరఫరా నిలిచిపోవడంతో రోజు ఉపాధి కూలీలతో పూడికతీతతో పాటు ముళ్లపొదల తొలగింపు పనులు కొనసాగుతోంది. యాసంగిలో ప్రధాన ఎడమకాల్వ ద్వారా కేవలం రామన్‌పాడు రిజర్వాయర్ వరకు 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించడంతో మిగిలిన ఆయకట్టు కాల్వలు నీటి ప్రవాహం లేక ఎండుముఖం పట్టాయి. ఈసారి వేసవిలో కాల్వల మరమ్మతులకు ప్రతిపాదనలు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన పీజేపీ అధికారులు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ఆయా మండలాల్లోని నీటిపారుదలశాఖ ఏఈలు ఎంపీడీఓలను సంప్రదించి కాల్వల్లో ఉపాధి పనులు చేపట్టాలని కోరడంతో సమీప గ్రామాల కూలీలతో పనులు చేపడుతున్నారు. వచ్చే వర్షాకాలంలో సాగునీరు సాఫీగా ముందుకు పారే విధంగా ప్రధాన, పిల్ల కాల్వల్లో సైతం పూడిక తొలగించి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారు.
85వేల ఎకరాల
ఆయకట్టు..
జూరాల ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు విస్తరించి ఉంది. మొత్తం 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గోపాల్‌దిన్నె రిజర్వాయర్‌కు సైతం ఇదే కాల్వ ద్వారా నీరు సరఫరా అవుతుండటంతో అత్యధికంగా జిల్లా ప్రజలకే లబ్ధి చేకూరుతుంది. ఎనిమిదేళ్లుగా కేవలం వానాకాలంలోనే ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందిస్తున్న అధికారులు, యాసంగిలో మాత్రం వారబందీ విధానంలో ఆయకట్టు కుదించి నీటిని వదులుతున్నారు. ప్రతిసారి వేసవిలో మరమ్మతుల కారణంగా కాల్వలో పూడికతీత పనులు ముందుకు సాగకపోయేవి. ప్రస్తుత వేసవిలో కాల్వ మరమ్మతు లేకపోవడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు కొనసాగుతున్నాయి.
జూరాల ఎడమ,
అనుబంధ కాల్వల్లో పూడికతీత
నీటిపారుదలశాఖ సిఫార్సులతో ఉపాధిహామీ పథకంలో..
ఎంపీడీఓల పర్యవేక్షణలో
ఊపందుకున్న పనులు
వేసవిలో మరమ్మతులు లేకపోవడంతోనే..


