కందనూలు: జిల్లాలో ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,191 మందికి గాను 2,066 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 1,881 మందికి గాను 1,775 మంది, ఒకేషనల్ విభాగంలో 310 మందికి గాను 291 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 653 మందికి గాను 624 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 503 మందికి గాను 480 మంది, ఒకేషనల్ విభాగంలో 150 మందికి గాను 144 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 125 మంది, ద్వితీయ సంవత్సరంలో 29 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
ఆదివాసీల ఆర్థిక
స్వావలంబనకు కృషి
అమ్రాబాద్: ఆదివాసీల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. శనివారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ రైతువేదికలో మహిళా సమాఖ్య సభ్యులు, వీఓఏలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు నిర్వహిస్తున్న సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలన్నారు. నిరుపేద కుటుంబాలకు రుణాలు అందించి.. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మన్ననూర్‌లో ఇటీవల మరణించిన పంబలి తిరుమలయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సమావేశంలో ఏపీఓ సైదులు ఉన్నారు.
సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయా పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పిండి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా పనిచేస్తుందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేవలం వాహనదారులకు మాత్రమే కాకుండా.. సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని.. పేదలు, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు పెరిగి పంటల సాగు భారంగా మారిందన్నారు. మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా, ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగించకుండా ఎకై ్సజ్ సుంకాలు పెంచడం దారుణమన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.


