మక్కల కొనుగొల్లు! | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగొల్లు!

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

జిల్లాలో మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు

కందనూలు: ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్లలో ఆలస్యంతో కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గన్నీబ్యాగులు, హమాలీలు, రవాణా కష్టాలతో అసలు మక్కలను అమ్ముకుంటామో లేదోనని ఆవేదన చెందుతున్నారు. మక్కల కుప్పలతో కేంద్రాలు నిండిపోగా.. వాతావరణ మార్పులతో ఆందోళనకు గురవుతున్నారు. సాగు కష్టాలు దాటుకొని పండించిన పంటను విక్రయించడానికి తీసుకొస్తే.. నేడు, రేపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు సమస్య కొలిక్కి రాకపోవడంతో రైతులు చేసేదేమీ లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

అకాల వర్షాలతో బెంబేలు..

ఓవైపు మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం.. మరోవైపు అకాల వర్షాలు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ విపరీతంగా కొట్టి.. సాయంత్రానికి మబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం జిల్లాకేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో మార్కెట్‌లో మక్కలు తడవడంతో పాటు కొంతమేర కొట్టుకుపోయాయి. తడిసిన మక్కలను రైతులు మళ్లీ ఎండబెట్టి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.

తక్కువ ధరకు అమ్ముకున్నా..

నేను 70 క్వింటాళ్ల మక్కలను రూ. 1,750 ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నా. ఇంకా 50 క్వింటాళ్లు ఉన్నాయి. అవి కూడా వారికే అమ్ముతాను. ప్రభుత్వానికి అమ్మాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. ఇంటి వద్ద గొర్రెలు, పశువులు ఉన్నాయి. వాటి వెంబడి వెళ్లే వారు ఎవరు లేరు. చేసేదేమి లేక ప్రైవేటు వారికి అమ్ముకున్నాను.

– మల్లేష్‌, రైతు దేశిటిక్యాల, నాగర్‌కర్నూల్‌

15రోజులు అవుతుంది..

నేను ఐదెకరాల్లో మక్కలు వేశాను. 177 క్వింటాళ్లు తూకం వేసి సంచుల్లో నింపి 15 రోజులు అవుతుంది. అధికారులను అడిగితే లా రీలు వచ్చిన వెంటనే పంపిస్తామని అంటున్నారు. ఏ సమయంలో వర్షం పడుతుందోనని దిక్కుతోచని స్థితిలో ఉన్నా. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

– సుగుణయ్య, రైతు,

బొందలపల్లి నాగర్‌కర్నూల్‌

రెండు, మూడు రోజుల్లో పూర్తిచేస్తాం..

ప్రస్తుతం మార్కెట్‌యార్డు కొనుగోలు కేంద్రంలో 60వేల బ్యాగులు ఉన్నాయి. జిల్లాలోని అన్ని గోదాములు నిండి ఉన్నాయి. దీంతో మార్కెట్‌లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో షిప్టుచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను పూర్తిచేస్తాం.

– తహమీనా, జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలరోజులు దాటినా కొలిక్కిరాని వైనం

రోజుల తరబడి పడిగాపులు

వెంటాడుతున్న అకాల వర్షాలు

చేసేది లేక ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement