రక్తదానం.. మరొకరికి ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం.. మరొకరికి ప్రాణదానం

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

నాగర్‌కర్నూల్‌ క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని.. తద్వారా ఆపదలో ఉండే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నర్సింగ్‌ అధికారుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపత్కాలంలో అవసరమైన రక్తం దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌, కౌన్సిలర్‌ సింధుజ, తెలంగాణ నర్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు జానకీదేవి, కార్యదర్శి ఆనంద్‌, జనరల్‌ ఫిజీషియన్‌ ప్రొ.సూర్యనారాయణ, ఆర్‌ఎంఓలు డా.రవిశంకర్‌, డా.రోహిత్‌కుమార్‌, జిల్లా రెడ్‌క్రాస్‌ అధ్యక్షుడు సాయిబాబా పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కల్వకుర్తి టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ/ఏటీసీలలోని వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కల్వకుర్తి ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్వకుర్తిలోని ఏటీసీలో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, సోలార్‌ టెక్నీషియన్‌తో పాటు నూతన అడ్వాన్స్‌డ్‌ కోర్సులు మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమేషన్‌ టెక్నీషియన్‌, ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌, వర్చ్యూవల్‌ అనాలిసిస్‌ అండ్‌ డిజైనర్‌, ఇంజనీరింగ్‌ డిజైన్‌ టెక్నీషియన్‌, సీఎన్‌సీ మెషినింగ్‌ టెక్నీషియన్‌, మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ట్రేడ్లలో మొదటి విడత సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతి మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు బోనఫైడ్‌, కుల ధ్రువపత్రం, ఈ–మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌, ఫోటోతో జూన్‌ 8వ తేదీలోగా https://iti.tela ngana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆమె సూచించారు. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.100 చెలించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఐటీఐ కళాశాలలో లేదా 85004 61186, 85004 61220, 86887 60187 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

పంట మార్పిడితో అధిక దిగుబడులు

వెల్దండ: పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు విజయలక్ష్మి, యం. పల్లవి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చెర్కూర్‌ గ్రామంలోని రైతువేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు. సర్పంచ్‌ శ్రీనివాసులు, ఉపసర్పంచ్‌ కొండల్‌, ఏఈఓ ప్రసన్న, కార్యదర్శి హరిణి తదితరులు ఉన్నారు.

స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా హౌస్‌ వైరింగ్‌, బైక్‌ మెకానిక్‌ రంగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్లు 99633 69361, 98481 42489లను సంప్రదించాలని సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

జడ్చర్ల: జడ్చర్లలోని సెట్విన్‌ సాంకేతిక శిక్షణ సంస్థలో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో బ్యూటీషియన్‌, ఎలక్ట్రీషియన్‌, హోం అప్లియెన్సెస్‌ కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సెట్విన్‌ కోఆర్డినేటర్‌ విజయ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18– 35 ఏళ్లలోపు మైనార్టీ ముస్లిం యువతీ, యువకులు మాత్రమే ఆధార్‌, 10వ తరగతి సర్టిఫికెట్‌, రెండు ఫొటోలతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నం.94415 65895ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement