● రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
కందనూలు: జిల్లాలో రైతుల నుంచి మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయని.. ఇప్పటికే మొక్కజొన్న సేకరణ 60శాతం పూర్తిచేశామని, రానున్న పది రోజుల్లో 90శాతం పూర్తిచేస్తామని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వెల్లడించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస మద్దతు ధరలతో పంట కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. జిల్లావ్యాప్తంగా 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 1.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగిందన్నారు. అయితే గోదాముల్లో నిల్వ, హమాలీల సమస్య కారణంగా కొంత ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు. వాటిని అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రానున్న వారం, పది రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు గాను ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు..
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చెప్పారు. మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ అమరేందర్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి.. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు సకాలంలో తరలించేందుకు అవసరమైన హమాలీలను సమకూర్చడంతో పాటు రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా లారీలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ పరీక్షలు, తూకం ప్రక్రియ, చెల్లింపుల వ్యవస్థ వంటి అంశాల్లోనూ పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


