రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

గద్వాల/ఎర్రవల్లి: ప్రధానమంత్రి ధన్‌–ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంతో రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు అభివృద్ధి సాధించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర వ్యవసాయశాఖ (పీఎంఓ) నోడల్‌ అధికారి రఘు అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ధన్‌–ధాన్య కృషి యోజన కేవలం గణాంకాలు, లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా.. రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు, పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, నేల ఆరోగ్య సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మార్కెట్‌ అనుసంధానం వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఎర్రవల్లి మండలం తిమ్మాపురం, కొండేరు, జింకలపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి.. రైతుల చేపల చెరువులను పరిశీలించారు. బీచుపల్లిలో తెలంగాణ ఆయిల్‌పామ్‌ నర్సరీని సందర్శించి, జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం, రైతులకు లభిస్తున్న ఆదాయం వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా కొండేరు శివారులో సాగుచేసిన కూరగాయల తోటలను ఆయన పరిశీలించి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అమలవుతున్న పథకాలు, రుణ సదుపాయాలు, ఈ ప్రాంత మౌలిక వసతులు, తదితర విషయాలపై రైతులతో ఆరా తీశారు. కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయిల్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌, డీఏఓ వీరప్ప, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్‌, ఆయిల్‌ఫెడ్‌ ఏడీఏ శివనాగిరెడ్డి, డివిజినల్‌ ఉద్యానశాఖ అధికారులు రాజశేఖర్‌, ఇమ్రానా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement