రైతు శ్రేయస్సే ప్రజా ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతు శ్రేయస్సే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

May 12 2026 1:14 AM | Updated on May 12 2026 1:14 AM

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు

సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ

మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్‌ క్రైం: రైతు కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాలో రైతులు, కొనుగోలుదారులు, రైస్‌మిల్లర్లు పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఎవరూ ఎవరినీ బతిమాలుకునే పరిస్థితి రాకుండా.. వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా చేపట్టేలా అందరూ సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మంత్రితోపాటు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాని అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. రైతులకు అన్యాయం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వరి కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, రవాణా కాంట్రాక్టర్లు సమయానికి లారీలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి పంట వివరాలను ముందస్తుగానే నమోదు చేయాలని సూచించారు. ధాన్యం సేకరణ గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, నిల్వల వద్ద ఆలస్యం జరగకుండా వేగంగా తరలించాలన్నారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి మండలానికి వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి అందులో కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలను వెల్లడిస్తే వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాటిని పరిష్కరించేలా కృషిచేస్తారన్నారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీ చేయాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు.

సమన్వయంతో ముందుకు..

కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు ఎక్కడైనా సమస్యలను ఎదుర్కొంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా, మొక్కజొన్న కొనుగోలు చేసి అందుకు అవసరమైన గోదాంలు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో పొద్దు తిరుగుడు పంట దిగుబడి ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.

ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పరిధిలో ఈ సీజన్లో 3 లక్షల మె.ట., మొక్కజొన్న దిగుబడి వచ్చిందన్నారు. కొనుగోలు ప్రక్రియ ముందుగానే మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి రైతులకు మేలు జరిగేలా చేయడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement