నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా జడ్జి రమాకాంత్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని కోర్టు కార్యాలయంలో జిల్లా జడ్జిని కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు అందిచారు. అనంతరం జరిగిన సమావేశంలో న్యాయ వ్యవస్థ, జిల్లా అధికార యంత్రాంగం పరస్పర సమన్వయంతో చేపట్టాల్సిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు వేగవంతమైన న్యాయసేవలు అందించడం, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాల్లో సమన్వయం పెంపొందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో పరస్పర సహకారం వంటి అంశాలు చర్చించారు.
ఫిర్యాదులు వేగంగాపరిష్కరించాలి
కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణిలో 39 దరఖాస్తులు వచ్చాయని, వీటిని వెంటనే పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 6 అర్జీలు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రయేమం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో బాధితుల నుంచి ఎస్పీ 6 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 1 భూమి పంచాయతీ, 5 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు.
పాలిసెట్‌కుపక్కాగా ఏర్పాట్లు
కందనూలు: జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే పాలిసెట్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని పాలిసెట్ జిల్లా కన్వీనర్ మదన్‌మోహన్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సీఎస్, డీఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,911 మంది విద్యార్థులు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, వీరికోసం 9 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్ష కేంద్రాలను జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా సులభంగా గుర్తించి పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చన్నారు.
ఎస్టీ గురుకులాల్లో అడ్మిషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి తెలిపారు. మొత్తం 9 గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ నె ల 16, 18 కౌన్సెలింగ్ నిర్వహించిన భర్తీ చేస్తా మన్నారు. ధర్మాపూర్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్‌లో కౌన్సెలింగ్ ఉంటుందని, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 94909 57312 సంప్రదించాలని సూచించారు.


