సర్కారు బడికి వెళ్లేలా..! | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడికి వెళ్లేలా..!

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

ప్రతిభావంతులకు బహుమతులు

వారోత్సవాలు ఇలా..

పది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

అచ్చంపేట: జిల్లాలో పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మౌలిక వసతులపై దృష్టిసారించిన యంత్రాంగం కార్పొరేట్‌ స్థాయి పాఠశాలల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా బడుల పునఃప్రారంభానికి ముందుగానే సర్వం సిద్ధం చేస్తోంది. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి శనివారం వరకు ‘విద్యా వారోత్సవాలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 2026– 27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల పెంపుపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తూ.. ప్రతి పాఠశాలకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించింది. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపొందించేందుకు విద్యాశాఖతో కలిసి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టాలని, బోధనలో నాణ్యత, పాఠశాలలో వసతులు, పరిశుభ్రత, డిజిటల్‌ క్లాస్‌రూంల ఏర్పాటు, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా వారం రోజులపాటు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సమర్థవంతంగా ప్రజలకు వివరించి ప్రతి పాఠశాల నిర్ధేశిత లక్ష్యాన్ని వందశాతం చేరుకోవాలని ఎంఈఓలు, హెచ్‌ఎంలను ఆదేశించింది.

సర్పంచ్‌లతో విద్యాభివృద్ధికి చర్యలు..

13న నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించనున్నారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

బడిబాటతో చైతన్యం..

14న ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట నిర్వహించనున్నారు. గ్రామాలు, వార్డుల్లో ర్యాలీలు చేపట్టి విద్యపై అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, మధ్యాహ్న భోజన కార్మికులకు వంట పోటీలు నిర్వహిస్తారు. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయనున్నారు.

గ్రంథాలయాలపై అవగాహన

15న గ్రంథాలయ దినోత్సవం నిర్వహించనున్నారు. ‘గ్రంథాలయాలు– జ్ఞాన హృదయం’ నినాదంతో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా ఉత్తమ పాఠకులకు గుర్తింపు కార్యక్రమాలు చేపట్టనున్నారు.

సాంస్కృతిక సందడి..

16న కళా వైభవం ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ దినోత్సవం నిర్వహించనున్నారు. జవహర్‌ బాలభవన్‌, పీఎంశ్రీ పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. కోలాటం, తోలు బొమ్మలాట, పేరిణి శివతాండవం, ఒగ్గు కథ వంటి జానపద కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. రాష్ట్రస్థాయి ప్రదర్శన కోసం ఉత్తమ చిత్రపటాలు, శిల్పాలను ఎంపిక చేయనున్నారు.

శిథిల భవనాలపై..

జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను గుర్తించనున్నారు. వాటిని ఇక విద్యా కార్యకలాపాలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోనున్నారు. నిబంధనల ప్రకారం వాటిని కూల్చివేయడం, వేలం వేసి ప్రాంతాన్ని సురక్షితంగా మార్చేందుకు చర్యలు చేపడుతారు.

జిల్లాలో నేటినుంచి విద్యా వారోత్సవాలు

99 రోజుల ప్రణాళికలో

ప్రత్యేక కార్యక్రమం

విద్యార్థుల్లో ప్రతిభ వికాసం,

పాఠశాలల అభివృద్ధే లక్ష్యం

ప్రభుత్వ బడుల్లో

వసతుల కల్పనకు ప్రాధాన్యం

పునఃప్రారంభానికి ముందే

సర్వం సిద్ధం చేసేలా చర్యలు

17న విద్యా విజయోత్సవం నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్‌, క్రీడల్లో జిల్లాస్థాయి లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యా ర్థులకు రూ.10 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. విద్యలో అ త్యుత్తమ ప్రతిభ వేడుకగా జరుపుకోవడం అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

విద్యా వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం పునాది దినోత్సవం జరపనున్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల పనులను ప్రారంభించడంతోపాటు ఇంకా ప్రారంభం కాని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదేరోజు పీఎంశ్రీ బడుల్లో వేసవి శిబిరాలు ప్రారంభించనున్నారు. కోడింగ్‌, ఆర్ట్స్‌, యోగా, క్రీడల వంటి విభాగాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 103 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. వీరు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఈ నెల 12 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రెమెడియల్‌ క్యాంపులు ప్రారంభం కానున్నాయి. నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులకు నాగర్‌కర్నూల్‌ బాలుర ఉన్నత పాఠశాల, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల విద్యార్థుల కోసం కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అదేరోజు ఇంటర్మీడియట్‌ రెమెడియల్‌ క్యాంపుల ముగింపు చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement